వేములవాడలో ఆదివారం అర్ధరాత్రి నుంచే భయం భయం నెలకొన్నది. తిప్పాపూర్ చౌరస్తా నుంచి మూలవాగు రెండో బ్రిడ్జి వరకు భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు దూసుకురాగా, రాత్రంతా భయానక పరిస్థితి కనిపించింది. సోమవారం ఉదయాన్నే పోలీసు పహారా మధ్య కూల్చివేతలు మొదలు పెట్టగా బాధితులు ఆగ్రహించారు. ఎలాంటి నోటీసులు, పరిహారం ఇవ్వకుండా తమ భవనాలు, షాపులు, ఇండ్లను కూల్చివేయడంపై మండిపడ్డారు. బుల్డోజర్లను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో రేవంత్ ప్రభుత్వంతోపాటు స్థానిక ఎమ్మెల్యేపై దుమ్మెత్తి పోశారు.
వేములవాడ రూరల్, జూలై 14 : వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ సమీపంలో మూలవాగు రెండో వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఆ పనులు పూర్తి కావాలంటే మరో సంవత్సర కాలం పడుతుంది. కానీ, అధికారలు తిప్పాపూర్ చౌరస్తా నుంచి వంతెన వరకు భవనాలు, ఇండ్లను కూల్చివేసేందుకు ఆదివారమే సిద్ధమయ్యారు. రాత్రి 11 గంటల వరకు రెండు బుల్డోజర్లను తీసుకొచ్చారు. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, పరిహారం అందించకుండా కూల్చివేతలకు సిద్ధం కావడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామగ్రి సర్దుకునేందుకు ఒక రోజైనా సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా బుల్డోజర్లతో దుకాణాలను కూల్చివేస్తామని చెప్పడంతో బాధితులు ఆందోళన చెందారు. కొందరు అప్పటికప్పుడు సామగ్రిని ఆటోల్లో తరలించారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచే కూల్చివేతలు ప్రారంభించడంతో దాదాపు 30 మంది నిర్వాసితులు మరోసారి ఆగ్రహించారు.
నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చడంతో ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి పనులు పూర్తయిన తర్వాత తమ భవనాలు అడ్డుగా ఉంటే తాము అభ్యంతరం వ్యక్తం చేసే వాళ్లం కాదని తెలిపారు. కనీసం పరిహారం ఇవ్వకుండానే ఇండ్లు, దుకాణ సముదాయాలను కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. వెంకట్రెడ్డి రాజేశ్వరి అనే బాధితురాలు ఇండ్ల పరిహారం ఇవ్వకుండానే కూల్చివేయడంపై బుల్డోజర్కు అడ్డుగా నిరసన తెలిపింది. రేవంత్ ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము గెలిపించింది తమ ఇళ్లను కూల్చివేసేందుకేనా..? అంటూ మండిపడింది. చివరకు ఆమెను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
భవనంపైకి ఎక్కి నిరసన
భవనం కూల్చివేస్తారని తెలుపడంతో కల్లెపల్లి బాబు తనకు పరహారం ఇచ్చేంత వరకు కూల్చనివ్వబోమని కుటుంబసభ్యులతో కలిసి నిరసన తెలిపాడు. ఉదయం 7 గంటలకు బాబు భవనం పైకి ఎక్కగా, భవనం ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించారు. బాబు మధ్యాహ్నం రెండు గంటల వరకు భవనం పైనే ఉన్నాడు. ఎంతమంది చెప్పినా దిగకపోవడంతోపాటు తనకు పరిహారం ఇచ్చేంత వరకు బిల్డింగ్ దిగనని స్పష్టం చేశాడు. మధ్యాహ్నం తర్వాత నిరసన విరమించారు.