Veterinary camp | చిగురుమామిడి, సెప్టెంబర్ 19: పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు. మండలంలోని సుందరగిరి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతుల లాభనష్టాలను ప్రభావితం చేసే అంశాలలో పాడి పశువుల పునరుత్పత్తి సమస్యలు అత్యంత కీలకమన్నారు.
పాడిపశువుల గర్భకోశ వ్యాధుల నివారణకు శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో మూడు రోజులపాటు గ్రామాల వారిగా శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాధుల నివారణకు పరీక్షలు నిర్వహించి తగిన మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరంలో 78 ఆవులు, గేదెలకు గర్భకోశ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. రైతులు పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, పాల డైరీ చైర్మన్ తిరుపతి, సహాయ సంచాలకులు డాక్టర్ వినోద్ కుమార్, సీఈవో సత్య ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ రాజిరెడ్డి, చిగురుమామిడి, ఇందుర్తి మండల పశువైద్యాధికారులు తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, సాంబారావు, రైతులు పాల్గొన్నారు.