CPI Leaders | చిగురుమామిడి, జూలై 8: సమ, సమాజ స్థాపన కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు కష్టపడుతూ తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగిన వేముల వెంకట్రాజం మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి పేర్కొన్నారు. వేముల వెంకట్రాజం మృతదేహంపై వెంకటస్వామి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ జడ్పీటీసీ అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డితో పాటు జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు వెంకట్రాజం మృతదేహంపై రెడ్ క్లాత్, సీపీఐ జెండా కప్పి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ఇందుర్తి ప్రాంతంలో సీపీఐ బలోపేతం కోసం పార్టీ బలోపేతం కోసం ప్రజాప్రతినిధుల గెలుపు కోసం నిరంతరం కష్టపడుతూ పనిచేశాడని అన్నారు. ఇందుర్తి సర్పంచ్, ఎంపీటీసీగా గెలిచి అటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇటు గ్రామ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశాడని, చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించారని వెంకటస్వామి పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. వెంకట్రాజం అంత్యక్రియల్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కిన్నెర మల్లవ్వ, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, బూడిద సదాశివ, కంది రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కూన శోభారాణి, రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, సీపీఐ శాఖ కార్యదర్శులు ఎండీ ఉస్మాన్ పాషా, ఇల్లందుల రాజయ్య, మాజీ సర్పంచ్ బోయిని మొండయ్య, కూన లెనిన్, అందె చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.