వేములవాడ రూరల్, నవంబర్ 3: ‘ఆశతో వచ్చినవారికి కాకుండా ఆశయం కోసం పని చేసే వారిని ఆదరించండి.. కళ్లబొల్లి మాటలు చెప్పి.. బోరున ఏడ్చేవారికి సానుభూతి చూపిస్తే గోసపడుతాం.. కారు గుర్తుకు ఓటువేస్తేనే ఈ మరింత అభివృద్ధి చెందుతుంది.. కాంగ్రెస్ వస్తే కర్ణాటక గతే.. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల, చెక్కపల్లి, అచ్చనపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన ప్రచారం చేయగా, మహిళలు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు, కరెంట్‌కు తీవ్ర ఇబ్బందులు ఉండేవని గుర్తు చేశారు. కానీ స్వరాష్ట్రంలో ప్రజలకు సాగునీరు, తాగునీరు, 24 గంటల కరెంటును అందించిన సీఎం కేసీఆర్‌కు మనం రుణపడి ఉండాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే కర్ణాటక పరిస్థితే అవుతుందన్నారు. మూడు గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో..? మూడు గంటలే ఇస్తామంటున్నా కాంగ్రెస్ కావాలో?.. ప్రజలే ఆలోచన చేసుకోవాలన్నారు. ఇంటింటికీ కేసీఆర్ సంక్షేమ పథకాలు అందినట్లు తెలిపారు. మన పార్టీ, మన ఇంటి పార్టీ బీఆర్ఎస్కు అండగా ఉంటూ.. కారు గుర్తుకు ఓటేయాలన్నారు.
మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను గెలిపిస్తే గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీఇచ్చారు. నేను సేవ చేయడానికి వచ్చానే తప్పా.. డబ్బులు సంపాదించుకోవడం కోసం రాలేదన్నారు. స్వగ్రామమైన మల్కపేటలో గుడి, కార్పొరేట్ స్థాయిలో బడిని కట్టించానని, తాను పక్కలోకల్ అని.. మల్కపేట గ్రామ బిడ్డనని.. స్పష్టం చేశారు. ఎవరెన్ని చెప్పినా మోసపోకుండా.. కారు గుర్తుకే ఓటేయాలన్నారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ తీగల రవీందర్‌గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు గోస్కుల రవి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, ఎంపీపీ బండ మల్లేశం, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, సర్పంచులఫోరం అధ్యక్షుడు ఏశ తిరుపతి, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెల్మ బల్రెడ్డి, సర్పంచులు అడ్డిక జైపాల్‌రెడ్డి, ఎల్లవ్వ, ఎంపీటీసీ నర్సవ్వ, నాయకులు సురేశ్, బాలు, శ్రీనివాస్, దేవరాజు, నాగరాజు, మైసయ్య, నిఖిల్, రాంరెడ్డి, ఎల్లయ్య, గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.