godhavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 3: గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ అమేజింగ్ స్టార్, కళాకారుడు వేముల అశోక్ ప్రతిభకు పలు అవార్డులు వరించాయి. కరోనా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన మూడు సినిమాలకు ఎనిమిది ఆవార్డులు దక్కాయి.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంపిటేషన్ ఉగాది పురస్కారాల వేడుకల్లో కరోనా క్రియేషన్స్ నిర్వాహకుడు వేముల అశోక్ ను ఉత్తమ నటుడిగా, దర్శకుడిగా ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ఆయన నటించిన అమ్ములు సినిమా ఉత్తమ చిత్రంగా మొదటి బహుమతి గెల్చుకోగా, ఉత్తమ దర్శకుడిగా ఆకెన భాస్కర్, ఉత్తమ నటుడిగా వేముల అశోక్, ఉత్తమ విలన్ గా ఉదయ్ కుమార్, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ బేబి వర్షిత బహుమతులు గెల్చుకున్నారు.
అలాగే అశోక్ తీసిన భూలోకంలో శివ పార్వతులు, పద్మక్క తదితర లఘు చిత్రాలు కూడా ఉత్తమ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు బైరాన్ పల్లి సినిమా ప్రొడ్యూసర్ నరేశ్ వర్మ, సీనియర్ నటులు ప్రభావతి, సుడో చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నిర్వాహకులు ఐలు రమేష్, సీతా మహాలక్ష్మీ తదితరులు వేముల అశోక్ ను ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తనలోని ప్రతిభను గుర్తించి ఇన్ని అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. యూనిట్ సభ్యులందరి సమష్టి కృషితోనే ఈ అవార్డులు దక్కాయని, ఇదే స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో మరిన్ని సందేశాత్మక లఘు చిత్రాలు తెరపైకి తీసుకవస్తానని పేర్కొన్నారు. ఈ అవార్డుల పట్ల అశోకు రామగుండం ప్రాంత కళాకారులు అభినందనలు తెలిపారు.