మధ్యమానేరు ప్రాజెక్టులో ఇల్లు కోల్పోయిన తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన వృద్ధ దంపతులు వేల్పుల ఎల్లయ్య-లచ్చవ్వ, పరిహారం కోసం ఏండ్లుగా తిరుగుతున్నారు. రెవెన్యూ డిపాజిట్ చేసిన పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చినా చేతికి పైసలు రాకపోవడంతో కంటతడి పెడుతున్నారు. ‘నీ బాంచెన్ కలెక్టర్ సారు.. మేం ముసళోళ్లం. మీ తల్లిదండ్రులసోంటోళ్లం. మమ్ముల్ని గోస పెట్టకండి. సచ్చిపోయేందుకు సిద్ధంగున్నం. మా పైసలు మాకివ్వండి’ అంటూ వేడుకున్నారు.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 18 : చీర్లవంచకు చెందిన వృద్ధ దంపతులు వేల్పుల ఎల్లయ్య-లచ్చవ్వ మధ్యమానేరు ప్రాజెక్టులో ఇల్లు కోల్పోయారు. అప్పుడు అంటే తెలంగాణ రాకముందు.. ఇంటి పరిహారం తక్కువ రావడంతో అధికారులకు అర్జీ పెట్టుకొని, మళ్లీ రివాల్యుయేషన్ చేయించారు. అయినా పరిహారం తక్కువగానే నిర్ణయించడంతో ఆఫీసుల చుట్టూ తిరిగారు. తమకు పరిహారం రూ.12లక్షల వరకు రావాలని నాటి సమైక్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో ప్రభుత్వం 2013లో 7.86 లక్షలు రెవెన్యూ డిపాజిట్ చేయడంతో అధికారులు కూడా తాము ఏం చేయలేమని చెప్పారు.
దాంతో ఆవేదన చెందిన ఆ వృద్ధ దంపతులు, పలుసార్లు కలెక్టర్‌ను సైతం కలిసి వేడుకున్నారు. ఏండ్ల పాటు తిరుగుతూనే ఉన్నారు. చివరకు ఏడాదిన్నర క్రితం తమ డబ్బులు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఎల్లయ్యకు 7.86 లక్షలు పరిహారం చెల్లించాలని, ఈ ఆదేశాలు అమలు చేయాలని జూన్ 3న రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ను కోర్టు ఆదేశించడంతో సంబురపడ్డారు. ఇప్పటికైనా పరిహారం అందుతుందని ఆశించారు.
కానీ, పరిహారం అందకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. బుధవారం మరోసారి ఆ పిటిషన్ విచారణకు రావడం, తామిచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని కలెక్టర్‌పై కోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో ఆ వృద్ధ దంపతులు ఎల్లయ్య-లచ్చవ్వ తమ గోడు వెల్లబోసుకున్నారు. గురువారం మీడియా ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడే ప్రాజెక్టులో సర్వం కోల్పోయామని, పరిహారం కోసం తిరుగుతున్నామని వాపోయారు. 12లక్షల రావాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు.
కోర్టుకు పోతే జడ్జి దయ చూపి మా పైసలు మాకు ఇవ్వాలని చెప్పారని, అయినా తమకు అందలేదని వాపోయారు. తాము మస్తు కష్టపడ్డామని, తమ కొడుకులు, బిడ్డలు ఇంత గంజి పోస్తే తాగి బతుకుతున్నామన్నారు. ‘కలెక్టర్ సారు నీ బాంచెన్. నీకు దయ రావాలే’ అని కంటతడి పెట్టారు. ‘బాంచెన్ నీ కాల్మోక్తా. మీరు సదువుకున్న గొప్పోళ్లు. మే కష్టం చేసుకుని బతికేటోళ్లం. మీ తల్లిదండ్రులసోంటోళ్లం. దయచేసి మమల్ని ఆదుకోండి’ అని విజ్ఞప్తి చేశారు.