కూరగాయల ధరలు సెగలు కక్కుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వానకాలం సీజన్ ప్రారంభంలో కూరగాయల ధరలు సహజంగానే పెరుగుతుంటాయి. కానీ, ఈసారి వినియోగదారులు భరించలేని విధంగా ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొనాలన్నా అగ్గిలో చెయ్యిపెట్టినట్టే భగ్గుమంటున్నాయి. పదిహేను రోజుల కిందటి వరకు 30 మాత్రమే ఉన్న టమాటా, ఇప్పుడు ఏకంగా సెంచరీకి చేరగా.. దాని వెనుకాలే బీర, కాకర, చిక్కుడు, కాలీఫ్లవర్, మిర్చి, గోరుచిక్కుడు, మునగ పరుగెడుతున్నాయి. కూరగాయల ధరలు విపరీతంగా పెరుగడంతో గిరాకీ లేక వ్యాపారులు దిగులు పడుతుంటే.. ఇంతేసి ధరలుంటే కొనేదెలా..? తినేదెలా? అని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
కరీంనగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : కూరగాయల ధరలు పిరమయ్యాయి. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. వంద రూపాయలు పెట్టనిదే ఏది కిలో వచ్చే పరిస్థితి లేకపోగా.. నానాటికీ పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు, మధ్య తరగతి ప్రజల గుండెలు గుబేల్మంటున్నాయి. గతంలో ఏదో ఒక కూరగాయ ధర పెరిగినా.. ఇప్పుడు మాత్రం చాలా రకాల కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. పదిహేను రోజుల కింద 500 పట్టుకుని పోతే నాలుగైదు రోజులకు సరిపడా తెచ్చుకునేది. ఇప్పుడు వెయ్యి రూపాయలదాకా పెట్టాల్సి వస్తున్నది. టమాట ధర అయితే విపరీతంగా పెరిగింది. పదిహేను రోజుల్లోనే 30 నుంచి 100కు చేరింది. మొన్నటి వరకు కిలో టమాటను కొన్నా.. ఇప్పుడు అద్దకిలో పావుకిలోతో సర్దుకుపోవాల్సి వస్తున్నది.

టమాటతోపాటు చిక్కుడు, కాకర, కాలీఫ్లవర్, క్యాప్సికం, క్యారెట్.. ఇలా ఏదికొనాలన్నా కిలోకు వంద రూపాయలు చెల్లించక తప్పని పరిస్థితి ఉన్నది. మిగతావి ఏమన్నా తక్కువగా ఉన్నాయా..? అంటే అదీ లేదు. వీటితోనే పోటీ పడుతున్నాయి. గోరు చిక్కుడు కిలో 80, పచ్చి మిర్చి 80 నుంచి 100, మునగ 80కి తక్కువ పలుకడం లేదు. ఇక అలసంద, వంకాయ, దొండ, క్యాబేజీ, చూస్తే 40 నుంచి 60కి కిలో ఉండగా.. ఈ ధరలను చూసి కనీసం ఆకు కూరలతోనైనా సర్దుకుందామని చూసే సామాన్యులకు నిరాశే మిగులుతున్నది. కిలో పాలకూర 80, గంగమాయిలి 60, తోట కూర 60 పలుకుతున్నది. ఇక కూరల్లో రుచి కోసం వేసుకునే కొత్తి మీర ధర కిలో 200 ఉండగా, 20కి రెండు పోసలు కూడా రావడం లేదు. పూదీన పరిస్థితి అంతే. కిలో 100కు చేరింది. అల్లం, ఉల్లి, వెల్లుల్లి ధరలు కూడా విపరీతమయ్యాయి.
స్థానికంగా కూరగాయల సాగు తగ్గిపోవడం, ప్రత్యేకంగా వేసవిలో కూరగాయలు పండించే రైతులు లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వేసవిలో కూరగాయల సాగు రిస్కుతో కూడుకున్న పనని ఎవరూ ఇటు వైపు చూడడం లేదు. ఎండల తీవ్రతను తట్టుకుని దిగుబడి వచ్చే రకాలు కూడా అందుబాటులో లేకపోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. స్థానికంగా కూరగాయలు పండించని కారణంగా కరీంనగర్ పట్టణంతోపాటు జిల్లాకు అవసరమైన కూరగాయలను వ్యాపారులు మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొని వ్యాపారం చేస్తున్నారు.
అయితే, ఈసారి వేసవిలో అకాల వర్షాలు కురియడంతో కూరగాయ పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఫలితంగా దిగుబడి తగ్గి ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టంగా తెలుస్తున్నది. అయితే, వేసవిలో కూరగాయల సాగుకు ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళికలు చేయకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తున్నది. రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు కూడా ఉన్నా.. వీటిని ఉద్యాన శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయకపోవడం, సాగు ప్రణాళిక లేక పోవడంతో ఏటా ఈ దుస్థితికి కారణమవుతున్నది.
మాల్ కొందామంటెనే మాకు భయమైతంది. టమాట పెట్టే (25 కిలోలు) ఎంతున్నదనుకుంటున్నరు. రూ.1,800 నుంచి రూ.2 వేలు అయితంది. ఇంత ధర పెట్టి మాల్ తెచ్చినంక ఇప్పితే మూడు నాలుగు కిలోలు తరుగస్తది. కూరగాయలు దెబ్బతింటయి. ఇవన్నీ చూసుకుని మాకు నష్టం లేకుంట అమ్ముకోవాలె. ధర బాగ పెడితే కొనెటోళ్లు ఉండరు. అంతకు ముందు మార్కెట్ల సందులేకుంట మంది ఉండెటోళ్లు. ఇప్పుడు కనిపిస్తండ్రా. పొద్దుగాల, సాయంత్రం గంట, రొండు గంటలు గిరాకీ ఉంటంది. పొద్దుగాల సంది కూసుంటే ఐదు వందలు సుతం గిట్టుతలేవు. వ్యాపారం ఎట్ల చేసుడు..
– శారద, వ్యాపారి
ధరలు విపరీతంగా పెరిగినయ్. అంతకు ముందు వారానికి రెండు సార్లయినా మార్కెట్‌కు వచ్చి కూరగాయలు కొనుక్కుందుము. ఇప్పుడు అడుగు పెట్టాల్నంటేనే భయమైతంది. ఏది కొనాలన్నా వందకు తక్కువ లేదు. మాలాంటి సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ఈరోజు ఐదు వందలు పట్టుకుని మార్కెట్‌కు వచ్చిన. నాలుగు ఐటమ్స్ కొనంగనే ఖతమైనయి. ఇంకో కూరగాయ కొనాలని ఉన్నా పైసలు లేక కొంటలేను. ధరలు విపరీతంగా ఉన్నయని మార్కెట్‌కు వచ్చెటోళ్లు లేకుంటయ్యిండ్రు.
– కాల్వ అను, చెంజర్ల
అబ్బో కూరగాయలు ఇంత పిరం అయితయని అనుకోలె. కరీంనగర్ వచ్చిన గదా అని కూరగాయలు తీసుకుందామని మార్కెట్‌కు వచ్చిన. రెండు రకాలకు మూడు వందలైనయి. నాకు ఇష్టమైన కూరగాయలు కొనుక్కుడుకాదు. ఏది అగ్గువ ఉన్నదో చూసి కొనాల్సి వస్తంది. కామన్‌గా అందరు టమాట కొంటరు. ఇది ఇప్పుడు కొనలేని పరిస్థితికి వచ్చింది. నిజం చెప్పాల్నంటే ఇప్పుడు ఏ పప్పో, చారో చేసుకొని కడుపు నింపుకోవాలె. ఇంకొద్ది రోజులు పోతే ధరలు తగ్గవచ్చు. కానీ, అంత కాలం బతకాలంటే ఏదో ఒకటి తినాలెకదా?
– బొల్లం జైపాల్ రెడ్డి, మల్లాపూర్ (బోయినపల్లి)