KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 3 : జిల్లాలోని కూరగాయ రైతులను దళారుల నుంచి రక్షించి, మార్కెట్లు కేటాయించాలని, కూరగాయ రైతుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నగరంలోని ఫిల్మ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో వందమందికి పైగా కూరగాయల సాగు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధి జంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ రైతుల పాలిట ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిందని మండిపడ్డారు.
రైతు బజార్ల పేరిట ఏర్పాటుచేసిన మార్కెట్లు దళారులకు అడ్డాగా మారాయని ఆరోపించారు. రైతు బజార్లను ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు గా మార్చడంతో, అన్ని రకాల విక్రయాలు జరుపుతుండగా, కూరగాయలు రోడ్లపై విక్రయించాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోయారు. కూరగాయల కమీషన్ ఏజెంట్ల వ్యవస్థను తొలగించి, మార్కెట్లలో నేరుగా విక్రయించుకునే సదుపాయం కల్పించాలని కోరారు. ఇతర జిల్లాలనుంచి కూరగాయలు ఆకుకూరల దిగుమతిని నిషేధించి, జిల్లాలోని కూరగాయల సాగు రైతులు విక్రయించుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు నిత్యం స్థిరపరా చేసే ఆకుకూరలు కూరగాయలు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్లో టెండర్లు రద్దుచేసి నేరుగా రైతులు సరఫరా చేసేలా ప్రాంతాలవారీగా కేటాయించాలన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. నెల రోజుల్లోపు కూరగాయ రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోతే, ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కేశపట్నం, చిగురుమామిడి, గంగాధర, రామడుగు, తదితర మండలాల్లోని గ్రామాల నుంచి కూరగాయలు సాగు చేసే రైతులు పాల్గొన్నారు.