చినుకులు పడుతున్న వేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు యూరియా కోసం రణం చేస్తున్నారు. సాగుపనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఒక్క బస్తాను దక్కించుకోవడం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు.. ఒక్కోసారి రాత్రి వరకూ పడిగాపులు పడుతున్నారు. ఓవైపు అధికార పార్టీ నాయకులు, అధికారులు కొరత లేదని బుకాయించే ప్రయత్నం చేస్తున్నా.. మరోవైపు మాత్రం రైతులు ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రో సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతూనే ఉన్నారు.
గంటల తరబడి నిరీక్షిస్తున్నా సరిపడా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడ నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా ఉన్నది. సోమవారం ఎక్కడ చూసినా రైతులు అరిగోస పడుతున్న దృశ్యాలే కనిపించాయి. మరోవైపు పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేయడం నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులను మళ్లీ కండ్ల ముందుంచాయి.
కరీంనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓవైపు సాగునీళ్లు రాక ఇబ్బంది పడుతున్న ఉమ్మడి జిల్లా రైతులు, మరోవైపు యూరియా అందక అరిగోస పడుతున్నారు. ఇప్పడిప్పుడే వర్షాలు పడుతున్న వేళ సర్కారు ప్రణాళికా లోపంతో యూరియా అందక ఎదురుచూపులు చూస్తున్నారు. సోమవారం ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. ఓవైపు కొరత లేదని అధికారులు బుకాయిస్తుంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెజార్టీ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల పరిధిలో పడరాని పాట్లు పడ్డారు. ప్రధానంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడ నియోజకవర్గంలో తిప్పలు పడ్డారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే తీరున పడిగాపులు గాశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి 200 బ్యాగులు రాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా సరిపడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైదాపూర్ మండలం ఆకునూర్లోని సైదాపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌కు 230 బస్తాల యూరియా రాగా, రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కాగా యూరియా కొందరికే రాగా, మిగతా వారు వెనుదిరిగారు.
మానకొండూర్ రూరల్ మండలం వెల్ది, వేగురుపల్లిలో ఊటూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ చేశారు. ఒక్కో గ్రామానికి 230 బ్యాగుల చొప్పున అందజేశారు. అయితే అందరికీ సరిపోకపోవడంతో చాలా మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. చిగురుమామిడి మండలం రేకొండలోనూ బారులు తీరారు. పెద్దపల్లి జిల్లాలోనూ రైతులు ఇబ్బంది పడ్డారు. ఓదెల మండలం పొత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వద్ద ఉదయం నుంచే బారులు తీరగా, పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేశారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కునారం సహకార సంఘం వద్ద గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నారు. అయినా దొరకలేదని కొందరు రైతులు వాపోయారు. జగిత్యాల జిల్లాలోనూ రైతులు అవస్థలు పడ్డారు. పెగడపల్లి సహకార సంఘానికి సోమవారం 400 బస్తాల యూరియా రాగా, రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక్కో రైతుకు ఎకరాకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. అయినా అందరికీ సరిపోకపోవడంతో పలువురు రైతులు నిరాశతో వెనుదిరిగారు. మెట్పల్లి మండలం ఆత్మకూర్‌లో గోదాం వద్ద పడిగాపులు గాశారు.
గంటల తరబడి లైన్లో నిలబడలేక పట్టా పాస్ పుస్తకాలను వరుసలో పెట్టారు. 340 బస్తాల యూరియా వచ్చినా సరిపోలేదు. గొల్లపల్లి వ్యవసాయ సహకార సంఘానికి వచ్చిన 330 యూరియా రాగా, మార్కెట్ యార్డులో రైతులకు కూపన్లు ఇచ్చారు. సుమారు 400పైగా రైతులు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలో ఉన్నారు. అయినా ఒక్క బస్తానే ఇవ్వడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు.
సిరిసిల్లలో అడుగడగునా తిప్పలే
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు అరిగోస పడ్డారు. ప్రధానంగా విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడ నియోజకవర్గంలో అడుగడుగునా తిప్పలు పడ్డారు. చందుర్తి సహకార సంఘానికి స్టాక్ వచ్చిందన్న సమాచారంతో ఉదయం ఆరు, ఏడు గంటల సమయంలోనే బారులు తీరారు. వివిధ గ్రామాల నుంచి వందలాది మంది చేరుకున్నారు. ఒక దశలో రైతుల్లో ఆగ్రహం వెల్లువెత్తడంతో పోలీసు పహారా మధ్య పంపిణీ చేశారు.
అది కూడా ఎకరాకు బస్తా చొప్పున అందజేశారు. ఇక్కడ చాలా మంది మహిళా రైతులు నిలువ నీడలేక నీరస పడిపోయారు. అంతేకాదు, గంటల తరబడి నిలబడలేక వారి చెప్పులను క్యూలైన్లో పెట్టారు. ఇదే పరిస్థితి సనుగుల సహకార సంఘం పరిధిలోనూ కనిపించింది. ఇక్కడ వందలాది మంది బారులు తీరగా, పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేశారు. కోనరావుపేట మండలం కొలనూర్ సహకారం సంఘం పరిధిలోనూ పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఇదే మండలంలోని నిజమాబాద్ గ్రామంలోని ఆగ్రోస్ సేవాకేంద్రం వద్దకు కూడా భారీగా తరలి వచ్చారు.
ఇక్కడికి కేవలం 250 బస్తాల యూరియా మాత్రమే రాగా, దాదాపు 500కుపైగా రైతులు రావడంతో ఇబ్బందులు పడ్డారు. రాని రైతులకు ఒకటి రెండు రోజుల్లో ఇస్తామంటూ నచ్చజెప్పి పంపారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి పీఏసీఎస్‌కు దాదాపు 440 బస్తాల యూరియా రాగా, చెక్కపల్లి, నమిలిగుండుపల్లి, నూకలమర్రి, ఎదురుగట్ల, బాలరాజుపల్లి, అచ్చనపల్లి, నూకలమర్రి, వెంకటాంపల్లి గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చారు.
పోలీస్ పహారా మధ్యన రైతులకు అందజేశారు. బోయినపల్లిలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలోకి యూరియా ఉందని తెలుసుకున్న రైతులు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్టాక్ కొంత మాత్రమే ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ సహకార సంఘం గోదాం వద్ద ఉదయం 5గంటల నుంచే క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేశారు. నచ్చిన వాళ్లకే యూరియా బస్తాలు ఇస్తున్నారని, తాము గంటల తరబడి క్యూలో ఉన్నా ఇవ్వడం లేదని కొంత మందిరైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. రైతులు ఉదయం నుంచే క్యూ కట్టారు. ఇక్కడ కూడా డిమాండ్ మేరకు ఇవ్వలేదని వాపోయారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్, ఎల్లారెడ్డిపేట, అల్మాస్పూర్ సహకార సంఘాల పరిధిలోని గోదాముల వద్ద రైతులు భారీగా తరలి వచ్చారు. అడుగడుగునా ఇక్కడ ఇబ్బందులు పడ్డారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తరలి రాగా, డిమాండ్ మేరకు సరఫరా చేయకుండా అధికారులు చేతులెత్తేశారు. వెంకటాపూర్‌లో రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీస్ పహారా మధ్య బస్తాలు పంచారు. ఎకరానికి ఒక బ్యాగు చొప్పున పంపిణీ చేసినా అందరికీ సరిపడా రాలేదని రైతులు వాపోయారు.
వీణవంకలో రాస్తారోకో
వీణవంక, ఆగస్టు 11 : 15 రోజుల నుంచి యూరియా కోసం ఎదరుచూసిన వీణవంక మండల రైతులు చివరకు రోడ్డెక్కారు. సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వీణవంక మండలంలో దాదాపు 14 వేల మంది రైతులు ఉండగా, 29వేల ఎకరాలు సాగవుతున్నది. ఇప్పడిప్పుడే వర్షాలు పడుతుండగా యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నర్సింగపూర్ సహకారం సంఘం గోదాం నుంచి మాత్రమే యూరియా పంపిణీ చేస్తుండగా, అవి ఏమూలకూ సరిపోవడం లేదు. సోమవారం 470 బ్యాగుల యూరియా వచ్చిందని తెలిసి వందలాది మంది రైతులు ఉదయమే తరలివచ్చారు.
అయితే ఈ నెల 9న లిస్టు రాసిన వారికే మాత్రమే బ్యాగులు ఇస్తామని, కొత్తగా కావాల్సిన వారు వీణవంకలోని సొసైటీ వద్దకు వెళ్లి నమోదు చేసుకోవాలని చెప్పడంతో నర్సింగపూర్ నుంచి వీణవంక మధ్య రెండు మూడు కిలోమీటర్లు ఎలా వెళ్తామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో స్టాక్ కొంత మందికి మాత్రమే వస్తుందని నిర్వాహకులు చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహించారు. గ్రామంలోని జమ్మికుంట -కరీంనగర్ ప్రధాన రహదారిపైకి చేరుకొని ధర్నా, రాస్తారోకో చేశారు.
ఈ సమయంలో ఓ రైతు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కూడా సరఫరా చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ మాట్లాడగా.. ఓ పోలీస్ అధికారి జోక్యం చేసుకొని ‘తమాషా చేస్తున్నారా..?’ అంటూ హెచ్చరించారు. దీంతో రైతులు ఒక్కసారిగా మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో రైతుల ఆవేశం కట్టలు తెంచుకున్నది. దీనిని గమనించిన ఇతర పోలీసులు నోరుజారిన అధికారిని అక్కడి నుంచి పంపించి రైతులకు సర్ది చెప్పడంతో సమస్య కొలిక్కి వచ్చింది. అయితే యూరియా కోసం వచ్చిన చాలా మంది రైతులకు సోమవారం దొరకలేదు. ఒకటి రెండు రోజుల్లో వస్తుందని నచ్చజెప్పి, పేర్లు నమోదు చేసుకోవడంతో రైతులు ఆవేదనతో వెనుదిరిగారు.
రైతుల గోస పట్టదా?
వేములవాడ, ఆగస్టు 11 : పంటలకు సాగునీరు ఇవ్వకపోగా కనీసం యూరియా కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ధ్వజమెత్తారు. రైతులపై వివక్షను సహించే ప్రసక్తే లేదని, గోస పెడితే ఊరుకునేది లేదని, తాము అన్నదాతలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేములవాడ యోజకవర్గంలోని మండలాల్లో నిరసన తెలిపి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
సిరిసిల్ల జిల్లాలో ఎరువులపై ముందస్తు ప్రణాళిక చేయకపోవడం వల్లే యూరియా కోసం రైతులు అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. నాలుగైదు రోజులుగా రైతులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. ఆయన సొంత గ్రామం రుద్రంగిలో రైతులు దాదాపు పది గంటల పాటు నిరీక్షించినా స్పందించక పోవడం బాధాకరమన్నారు.
ఈ సమస్య బయటకు రాగానే కలెక్టర్, ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, పరిషారం చూపడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఫలితంగానే ఈ సమస్య రోజురోజుకూ జటిలమవుతుందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎకడా లేనంత యూరియా కొరత రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. అందులోనూ వేములవాడ నియోజకవర్గంలో తలెత్తినట్టు కనిపిస్తున్నదన్నారు. సోమవారం చందుర్తి, సనుగుల సొసైటీల వద్ద పోలీస్ పహారా మధ్య పంపిణీ చేయడమే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.
యూరియా కొరతపై ఇటీవల ఇద్దరు రైతులు రుద్రంగిలో వాస్తవాలు మాట్లాడితే అది మీడియా వక్రీకరించిందంటూ తెల్లవారే సరికి సదరు రైతులను పిలిపించి, మళ్లీ వారితో మాట్లాడించి రికార్డు చేయించడమే కాకుండా, ఓ రైతుతో సారీ చెప్పే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. వందలాది మంది రైతులు అందులోనూ మహిళలు గంటల తరబడి కేంద్రాల వద్ద నిలబడడం, చెప్పులను క్యూలో ఉంచడం చూస్తే మళ్లీ సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే యూరియా కొరతను పరిష్కరించాలని, విప్ ఆది శ్రీనివాస్ దీనిపై స్పష్టతనివ్వాలని, ఏ తేదీలోగా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేసి ప్రభుత్వానికి బుద్ధిచెబుతామని హెచ్చరించారు.