Korutla MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, నవంబర్ 21: పట్టణాభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ కోరుట్లలో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు వార్డులలో మున్సిపల్ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్ కు సంబంధించి నెలకొన్న సమస్యలపై వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఇటీవల కోరుట్ల మున్సిపాలిటీకి మంజూరు చేసిన నిధులతో వార్డుల్లో అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తి చేయాలని మున్సిపల్ డీఈఈ, కమిషనర్లకు ఎమ్మెల్యే సూచించారు. వార్డులను పరిశుభ్రంగా ఉంచేలా రోజువారీ శుభ్రత చర్యలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడే ప్రసక్తి లేదని త్వరితగతిన వార్డుల్లో నెలకొన్న సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డీఈఈ సురేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, పట్టణ ప్రణాళిక అధికారి రమ్య, బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, ఉపాధ్యక్షుడు అతిక్, నాయకులు చిత్తరి ఆనంద్, వాసిక్ ఉర్ రెహమాన్, గంగాధర్, సందయ్య, తదితరులు పాల్గొన్నారు.