లోయర్ మానేరు డ్యాం జలాశయం అట్టడుగుకు చేరుకున్నది. పోయినేడు ఇదే సమయానికి నిండుగా కళకళలాడినా ఎల్ఎండీ, ఇప్పుడు వెలవెలబోతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఈ జలాశయానికి గతేడాది నీటిని విడుదల చేసినా, ఇప్పుడు నిర్లక్ష్యం కనిపిస్తున్నది. దాదాపు 25 రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు 14 టీఎంసీలకుపైగా పోత్తిపోసి, ఎగువకు తరలిస్తుండడంతో తమకెప్పుడు ఇస్తారని ఎల్ఎండీ ఆయకట్టు రైతాంగం ప్రశ్నిస్తున్నది. ప్రస్తుతం డ్యాంలో ఉన్న 5.5 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకే సరిపోదని, పంటల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నది. ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలని కోరుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండీ) దయనీయ స్థితికి చేరింది. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.449 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. గతేడాది ఇదే సమయానికి 23 టీఎంసీల నీరు ఉన్నది. పోయినేడు అధిక వర్షాలతో మోయతుమ్మెద వాగు నుంచి 1,500 క్యూసెక్కుల వచ్చింది. ఇప్పుడా పరిస్థితి లేదు. జలాశయం డెడ్ స్టోరేజీ 3 టీఎంసీలు కాగా, అదనంగా 2.4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా కరీంనగర్, వరంగల్ నగరాలతోపాటు మిషన్ భగీరథ కింద కరీంనగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలు, సిద్దిపేట పట్టణ తాగునీటి అవసరాలకే సరిపోనున్నాయి.
ఈ నేపథ్యంలో జలాశయంలో నీటిమట్టం పెరిగితే గానీ, సాగునీటి కోసం వాడుకునే అవకాశం లేదు. ఎల్లంపల్లి ద్వారా ఎత్తిపోతలతో మధ్యమానేరు నింపుతున్న అధికారులు ఎల్ఎండీకి ఇప్పటి వరకు నీటిని విడుదల చేయాలనే ఆలోచన చేయడం లేదు. గత నెల 27 నుంచి మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటి వరకు 14 టీఎంసీలకు పైగా నీటిని తరలించిన అధికారులు, అటు నుంచి అన్నపూర్ణ, సిద్దిపేటలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్లకు 6,462 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కానీ, ఎల్ఎండీకి నీటిని తరలించే విషయంలో తాత్సారం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న ప్రస్తుత పరిస్థితిలోనే నీటిని తరలిస్తేనే పంటలకు అవసరమైనప్పుడు నీటిని విడుదల చేసుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు పడితేనే రిజర్వాయర్‌కు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నట్టు తెలుస్తుండగా, ఒక వేళ వర్షాలు పడకపోతే తమ పరిస్థితి ఏంటని దిగువ మానేరు ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు.
పోయినేడు ఇదే సమయానికి ఎస్సారెస్పీలో 50 టీఎంసీల నీరు ఉండగా, ఆయకట్టు పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో 9.40 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. రెండు సీజన్లకు మొత్తం 58.082 టీఎంసీల నీటిని సరఫరా చేస్తే.. అందులో కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి ఎల్ఎండీ ద్వారా 47.567 టీఎంసీల నీటిని తరలించారు. కరీంనగర్ జిల్లాలో పరిశీలిస్తే కాకతీయ దిగువ కాలువ 122.450 కిలో మీటర్ నుంచి 144.175 వరకు, 146 నుంచి 202.178 కిలో మీటరు వరకు 1,31,352 ఎకరాలకు సాగునీరిచ్చారు. యాసంగిలో కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో దిగువ ఆయకట్టుకు నీళ్లు అందించారు. కానీ, ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నెల 7న ఎల్ఎండీ ఎగువన కాలువకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారు. 0 నుంచి 146 కిలో మీటర్ వరకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు అంటే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలతోపాటు కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ నియోజవర్గాల పరిధిలోని 4.27 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 48 టీఎంసీల నీరు ఉండగా, అందులో 30 టీఎంసీల వరకు సాగుకు వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. మిగతా 10 టీఎంసీల నీరు తాగు నీటి అవసరాలకు నిల్వ చేయనున్నారు.
ప్రస్తుతం ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి కూడా వరద తగ్గింది. ఎగువ ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా పడితే గానీ ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం లేదు. వర్షాలు ఎపుడు అనుకూలిస్తాయో..? తెలియదు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్న నీటిని ఎల్ఎండీ జలాశయానికి తరలించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అన్నపూర్ణ రిజర్వాయర్‌కు తరలించినట్టుగానే తమకు కూడా నీటిని తరలించాలని ఎల్ఎండీ దిగువ ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తుండగా, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
ఎల్ఎండీ ఆయకట్టులో ప్రస్తుతం వరి నాట్లు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటికే 80 శాతానికి పైగా నాట్లు పడ్డాయి. 1.30 లక్షల ఎకరాలకుపైగా నాట్లు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షపాతం తక్కువగా ఉండి కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగలేదు. చెరువులు, కుంటల్లోకి నిరుడిలా పూర్తి స్థాయిలో నీరు రాలేదు. ప్రస్తుతం బావులు, బోర్లపై ఆధారపడి నాట్లు వేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఇప్పటికిప్పుడు నీటి సమస్య రాకున్నా.. పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం పంట చేతికొచ్చే సమయంలో ప్రాజెక్టు నీరు తప్పకుండా అవసరముంటుందని రైతులు చెబుతున్నారు. అప్పుడు నీటిని విడుదల చేయకుంటే పంటలు ఎండిపోయే ప్రమాదముంటుంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ముందస్తుగా ఎల్ఎండీ జలాశయాన్ని నింపాల్సిన అవసరమున్నది.
ప్రస్తుతం ఎస్సారెస్పీ పరిస్థితి ఆశా జనకంగా లేదు. కేవలం 48 టీఎంసీల నీరే ఉన్నది. ఎగువ ప్రాంత పంటల కోసం 30 టీఎంసీలు విడుదల చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించాం. ఎల్ఎండీలో కేవలం 5 టీఎంసీలు మాత్రమే నీరున్నది. మధ్యమానేరులో ప్రస్తుతం 15.58 టీఎంసీలే ఉంది. మధ్యమానేరులో 20 నుంచి 25 టీఎంసీల నీరు చేరితే ఎల్ఎండీకి విడుదల చేయవచ్చు. ఇప్పటికిప్పుడు ఎల్ఎండీకి నీళ్లు మళ్లించే పరిస్థితి లేదు. వర్షాలు అనుకూలించి ఆశించిన నీరు చేరితే తప్పకుండా దిగువ ఆయకట్టుకు నీళ్లు విడుదల చేస్తాం.
– శంకర్, ఎస్సారెస్పీ ఈఎన్సీ