కరీంనగర్లో నర్సింగ్ కాలేజీ అప్‌గ్రేడ్‌పై నీలినీడలు అలుముకున్నాయి. గురువారం హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్రిన్సిపాల్‌కు సమాచారం అందక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సింగ్ స్కూల్‌ను కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తారా..? లేదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కేవలం ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల వినియోగంపై ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదనే కారణంగానే నిర్లక్ష్యం జరుగుతున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ఉత్తర తెలంగాణకు ప్రధాన కేంద్రంగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు అనుబంధంగా 2013-14లో అప్పటి ప్రభుత్వం నర్సింగ్ స్కూల్‌ను మంజూరు చేసింది. దీంతోపాటే నిజామాబాద్‌లోనూ ఏర్పాటు చేసింది. అప్పటికే రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా, సికింద్రాబాద్‌లోని గాంధీ, వరంగల్‌లోని ఎంజీఎం, నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నర్సింగ్ స్కూళ్లు ఉండగా, కరీంనగర్, నిజామాబాద్‌ను కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 6 నర్సింగ్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు.
అయితే కరీంనగర్ నర్సింగ్ స్కూల్ అప్‌గ్రేడ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. నర్సింగ్ స్కూళ్ల అప్‌గ్రెడేషన్‌కు సంబంధించిన మీటింగ్‌కు సంబంధించి ఈ నెల 17న మిగతా ఐదు స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు మాత్రమే సమాచారం ఇవ్వడం, గురువారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో సమావేశం నిర్వహించడం చూస్తే కరీంనగర్‌ను విస్మరించినట్టు స్పష్టమవుతున్నది. అయితే, 2022లోనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అన్ని నర్సింగ్ స్కూల్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. తీరా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కరీంనగర్‌ను ఎందుకు విస్మరిస్తున్నదనేది అనేక సందేహాలకు తావిస్తున్నది.
కరీంనగర్ నర్సింగ్ పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి అధికారులు 25 కోట్లకు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ నిధులతో భవన నిర్మాణం, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడి అధికారులు నివేదించారు. అయితే, అప్పుడున్న ప్రభుత్వం 3.32 కోట్లు ఇవ్వగా, ఈ నిధులను దేనికి వినియోగించారనేది ఇప్పటి వరకు వినియోగ పత్రం ఇవ్వనట్టు తెలుస్తున్నది. ఈ కారణంగానే కరీంనగర్ నర్సింగ్ పాఠశాలను కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు డీఎంఈ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారనే విషయం చర్చకు వస్తున్నది. ఇదే కారణమైతే ఇప్పటికైనా ఇక్కడి అధికారుల నుంచి డీఎంఈ అధికారులు వినియోగ పత్రం తెప్పించుకోవచ్చు కదా..? అనే వాదనలు వినిపిస్తున్నాయి.
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సుమారు పది జిల్లాల ప్రజలకు సేవలందిస్తున్నది. అందులో 650 పడకలు ఏర్పాటు చేయగా, కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అనేక వింగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. అంతే కాకుండా ఈ దవాఖానకు అనుబంధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు నర్సింగ్ స్కూల్‌ను కాలేజీగా అప్‌గ్రేడ్ చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని వైద్య యంత్రాంగం చెబుతున్నది. ముఖ్యంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో నర్సింగ్ విద్య అందుబాటులోకి వస్తుంది. ప్రధానంగా కరీంనగర్ మెడికల్ హబ్‌గా మారే అవకాశముంటుంది.
ప్రస్తుత నర్సింగ్ స్కూల్లో ప్రస్తుతం జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) డిప్లొమా కోర్సు మాత్రమే నిర్వహిస్తున్నారు. కాలేజీగా అప్‌గ్రేడ్ అయితే బీఎస్సీ నర్సింగ్ విద్య అభ్యసించే అవకాశముంటుంది. ఇప్పుడు పాఠశాలలో 40 సీట్లు మాత్రమే ఉండగా, కళాశాలగా మారితే వంద సీట్లకు పెరుగుతుంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సు నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఏడాదికి రెండు చొప్పున ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ప్రస్తుత స్కూల్లో ప్రిట్రైనింగ్ స్కూల్ (పీటీఎస్) పూర్తి కాగానే ప్రాక్టికల్స్‌లో భాగంగా ప్రభుత్వ దవాఖానలో వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు అత్యవసరంగా భావిస్తున్నారు.
కరీంనగర్ నర్సింగ్ పాఠశాలను అప్‌గ్రేడ్ చేసే విషయంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ప్రభుత్వ దవాఖానపై ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. కరీంనగర్‌తోనే ఏర్పాటు చేసిన నిజామాబాద్ నర్సింగ్ పాఠశాలను మాత్రం అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
కానీ, కరీంనగర్ నర్సింగ్ స్కూల్‌పై చిన్న చూపు కనిపిస్తున్నది. మిగతా ఐదు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసిన తర్వాత కరీంనగర్ పాఠశాలను కొనసాగిస్తారా..? లేదా..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పొన్నం జోక్యం చేసుకుంటే గానీ కరీంనగర్ నర్సింగ్ పాఠశాల కళాశాలగా అప్‌గ్రేడేషన్ పొందే పరిస్థితులు కనిపించడం లేదు.
మొదటి సెమిస్టర్ : కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, అప్లయ్డ్ అనాటమి, అప్టయ్డ్ ఫిజియాలజీ, అప్లయ్డ్ సైకాలజీ, నర్సింగ్ ఫౌండేషన్స్-1.
సెకండ్ సెమిస్టర్ : అప్లయ్డ్ బయోకెమిస్ట్రీ, అప్లయ్డ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, నర్సింగ్ ఫౌండేషన్స్-2, హెల్త్ నర్సింగ్ ఇన్ఫార్మెటిక్స్ టెక్నాలజీ.
మూడో సెమిస్టర్ : అప్లయ్డ్ మైక్రోబయోలజీ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఇన్క్లూడింగ్ సేఫ్టీ, ఫార్మకాలోజీ-1, ఫాథాలోజీ-1, అడాల్డ్ హెల్త్, నర్సింగ్-1 విత్ ఇంటిగ్రేడెట్ ఫాథో ఫిజియాలోజీ.
నాలుగో సెమిస్టర్ : ఫర్మకాలోజీ-2, ఫాథాలోజీ-2 అండ్ జెనటిక్స్, అడాల్డ్ హెల్త్ నర్సింగ్-2 విత్ ఇంటిగ్రేటెడ్ ఫాథో ఫిజియాలోజీ ఇన్క్లూడింగ్ జెరియాట్రిక్స్, ప్రొఫెషనలిజం, ప్రొఫెషనల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్క్లూడింగ్ బయోథిక్స్.
ఐదో సెమిస్టర్ : చైల్డ్ హెల్త్ నర్సింగ్-1, మెంటల్ హెల్త్ నర్సింగ్-1, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్-1 (ఇన్క్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎపిడిమియాలోజీ), ఎడ్యుకేషనల్ టెక్నాలజీ/నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టూ ఫోరెన్సిక్ నర్సింగ్ అండ్ ఇండియన్ లాస్.
ఆరో సెమిస్టర్ : చైల్డ్ హెల్త్ నర్సింగ్-2, మెంటల్ హెల్త్ నర్సింగ్-2, నర్సింగ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్ షిప్, మిడ్వైఫరీ/అబ్‌స్ట్రేట్రిక్స్ అండ్ గైనకాలోజి-1. ఏడో సెమిస్టర్ : కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్-2, నర్సింగ్ రిసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, మిడ్వైఫరీ/అబ్స్ట్రెట్రిక్స్ అండ్ గైనకాలోజి-2.
ఎనిమిదో సెమిస్టర్ : ఇంటర్న్ షిప్ (ఇన్టెన్సివ్ ప్రక్టికమ్/రెసిడెన్సీ పోస్టింగ్.