Urea | చిగురుమామిడి, సెప్టెంబర్ 1: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం రేకొండ, సుందరగిరి గ్రామాల్లోని యూరియా కేంద్రాల్లో తెల్లవారుజామున 3:30 నుండి చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు ఒకవైపు రైతులు మరోవైపు వేరువేరుగా రెండు లైన్లలో చెప్పులు, బండలు పెట్టారు. చిగురుమామిడికి 500 బస్తాలు యూరియా రాగా సుమారు 800 మందికి పైగా రైతులు క్యూలో ఉన్నారు.
రేకొండలో 350 బస్తాలు లాగా 400 వరకు రైతులకు ఉన్నారు. అలాగే సుందరగిరిలో 170 యూరియా బస్తాలు లాగా 200 మంది కి పైగా రైతులు యూరియా కోసం బారులు తీరారు. 10 గంటలకు యూరియా లోడ్ లారీలు రాగానే వెంటనే నిర్వాహకులు పంపిణీ చేశారు. అయినప్పటికీ క్యూలో ఉన్న రైతులకు యూరియా అందకపోవడంతో చిగురుమామిడి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. సుమారు గంటకు పైగా రైతులు ఆందోళన చేపట్టడంతో కరీంనగర్, హుస్నాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్, ఎస్సై సాయికృష్ణ రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి విరమింప చేయాలని కోరారు. యూరియా బస్తాలు ఇచ్చేంతవరకు వెళ్లబోమని రైతులు ఆందోళన మరింత తీవ్రతరం చేస్తూ రోడ్డుపై పడుకున్నారు.
సిఐ అధికారులతో మాట్లాడి మిగిలిన రైతులందరికీ వరుస క్రమంలో నిల్చోపెట్టి వారికి కూపన్లను అందజేశారు. మూడో తేదీన కూపన్ లో ఉన్న రైతులకు యూరియాను పంపిణీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. రాస్తారోకో క్రమంలో రైతులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరును నిరసించారు. సుందరగిరి రేకొండ గ్రామాల్లో సైతం రైతులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.