సిరిసిల్లటౌన్/ ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి, ఏప్రిల్ 23 : సిరిసిల్ల జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. దాదాపు 25 మంది రైతులకు చెందిన సుమారు 100 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకపోగా, మరికొంత తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమన్నారు.
ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు వేడుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ మార్కెట్ ఆవరణలోని కొనుగోలు కేంద్రంలో తడిసి ముద్దయింది. గుండారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. తంగళ్లపల్లి మండల కేంద్రంలో దీకొండ అశోక్ అనే నేత కార్మికుడి సాంచల కార్ఖానాలో గోడకూలి కండెల మిషిన్, సాంచాలు పాడై నష్టపోయాడు.

సిరిసిల్ల పట్టణంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. స్థానిక గాంధీనగర్లో ఓ ఇంటి గోడ కూలి పక్కన ఇంటిపై పడడంతో ఒకే కుటుంబంలోని వొలీఖాన్, అజ్మత్ దంపతులు, సుల్తానా, సమీన, అఫ్రీన్తోపాటు ఐదేండ్ల చిన్నారి గాయపడ్డారు. అఫ్రీన్తో పాటు ఐదేండ్ల చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులకు కరీంనగర్ దవాఖానకు తరలించారు. సిరిసిల్లలోని మొదటి బైపాస్ రోడ్డులో ఓ నిర్మాణానికి సంబంధించిన రేకుల షెడ్డు గాలి దాటికి రోడ్డుపై వచ్చి పడింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలో నేలకూలిన చెట్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. చైర్పర్సన్ జిందం కళ చెట్ల తొలగింపు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.