రాజన్న సిరిసిల్ల, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో భాగస్వాములం అవుదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు నిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చుడుతానని స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల పట్టణం, వీర్నపల్లి, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో సోమవారం పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో మున్నూరు కాపు సంఘ కల్యాణ మండప ప్రహరీ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన 10లక్షల పనులకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో కేంద్ర మంత్రిగా ఎదిగానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. రాజకీయాలు, పార్టీలు ఎన్నికల వరకే ఉంటాయని చెప్పారు. ఇక నుంచి అందరూ అభివృద్ధివైపు దృష్టిసారించాలని కోరారు. పేదలకు అండగా ఉన్నప్పుడే కుల సంఘాలకు విలువ ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రాణీరుద్రమ, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, కౌన్సిలర్ కల్లూరి రాజు, మాజీ కౌన్సిలర్ కామినేని నీలి శంకర్, సంఘ నాయకులు దుమాల శ్రీకాంత్, అగ్గి రాములు, ఆకుల జయంత్ పాల్గొన్నారు.