Vemulawada | వేములవాడ, జూలై 24 : నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శివ డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడి నిరసిస్తూ శుక్రవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ శుక్రవారం విజయవంతం అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ ప్రశ్నా పత్రం లీకేజీ కావడంతో దేశంలో 20 మందికి పైగా విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడారని ఆవేదనతో వ్యక్తం చేశారు.
దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజినామా చేయాలని యావత్ దేశ ప్రజలు డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో నిరసన వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించక పోవడం సిగ్గుచేటు అన్నారు. గత 20 రోజులు గా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన దీక్షలు చేపట్టిన విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ప్రశాంతంగా నిర్వహిస్తుంటే శాంతియుతంగా సాగుతున్న విద్యార్థుల ప్రదర్శనపై రాళ్లు విసిరి లాఠీఛార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం, రబ్బరు బుల్లెట్లు వినియోగం, వాటర్ కాన్వాయ్ ను ఉపయోగించడం దారుణమన్నారు.
హింసాత్మక దాడుల్లో వందలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులు, ఉద్యమ కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన తీరు ను, అనేక మంది పై తప్పుడు కేసులు పెట్టి , అక్రమంగా అరెస్టు చేసిన తీరును నిరసిస్తూ బంద్ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి, హరీష్, స్నేహిత, పల్లవి తదితరులు ఉన్నారు.