గోదావరిఖని, సెప్టెంబర్ 26: ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషి ఫలించింది. రామగుండం కార్పొరేషన్‌కు నిధుల వరదపారింది. నగర ప్రజలకు చందర్, ఇచ్చిన మాట మేరకు అలుపెరుగని పోరాటం చేసి మరీ రూ.100 కోట్ల నిధులు సాధించారు. గత మే నెల 8న రామగుండం నవనిర్మాణ సభలో భాగంగా గోదావరిఖనికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను రామగుండం బల్దియాకు రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే చందర్ విన్నవించారు. ఆ తర్వాత మంత్రిని హైదరాబాద్‌లో పలుమార్లు కలిసి నిధుల మంజూరు విషయమై చర్చించారు.
ఈ క్రమంలో మొదటి విడతగా గత నెల 17న టీయూఎఫ్‌ఐసీడీ ద్వారా రూ.50 కోట్లు మంజూరయ్యాయి. కాగా, మంగళవారం ఎమ్మెల్యే చందర్ తన జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఇదే సందర్భంలో రామగుండం కార్పొరేషన్‌కు మిగిలిన నిధులు ఇవ్వాలని కోరడంతో బర్త్ డే గిఫ్ట్‌గా ఓకే చెప్పేశారు. ఈ క్రమంలో మరో రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వంలో రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేండ్లలో నగరానికి సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులు, 14, 15 ఫైనాన్స్, ఎస్సీ సబ్ ప్లాన్, పట్టణ ప్రగతి ద్వారా రూ.300 కోట్లకుపైగానే వచ్చాయి. ఇప్పుడు మరో రూ.100 కోట్లు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు నా కృతజ్ఞతలు.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే