power cuts | కోల్ సిటీ, జూలై 17: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో గత మూడు రోజులుగా ట్రాన్స్ కో అధికారులు అప్రకటిత కరెంటు కోతలు విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ పావు గంటకోసారి కరెంటు పోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చెట్ల కింద సేద తీరే దుస్థితి దాపురించింది. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయానికి కూడా కరెంటు కోతలు తప్పడం లేదు.
మాటిమాటికీ కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అధికారులు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలుగుతోందని వాపోతున్నారు. అసలే వర్షాలు లేక ఇటు వాతావరణంలో మార్పుల కారణంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో క్రమంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కపోతలతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పారిశ్రామిక ప్రాంతంలో కరెంటు కోతలు రోజురోజుకూ పెరుగుతుండటం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అంధకారం నెలకొంటుంది. బుధ, గురువారాల్లో గంటల కొద్దీ కరెంటు సరఫరాకు విఘాతం కలిగింది. చీటికి మాటికి కరెంటు పోవడంతో ఇదెక్కడి గోస అంటూ ప్రజలు ఉపశమనం కోసం విసనకర్రలు చేత పట్టుకునే పరిస్థితి నెలకొంది. నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కోతలు ఏ తరహాలో ఉన్నాయో ఆలోచనతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.