రాజన్న సిరిసిల్ల, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : యునాని ఉచిత వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో దవాఖానకు తాళం పడింది. వైద్యుల కొరత రోగులకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలోని యునాని వైద్యశాలకు తాళం వేసి నెలరోజులవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన వైద్యం అందించే యునాని వైద్యశాలలో వైద్యుడు లేకపోవడంతో కాంపౌండర్తోనే నడిపించారు. ఇటీవల బదిలీల్లో భాగంగా కాంపౌండర్ కూడా మరోచోటికి బదిలీపై వెళ్లడంతో వైద్య సేవలు నిలిచి పోయాయి. యునాని వైద్యశాలకు కిడ్నీలో రాళ్లు, పిస్టులా, పైల్స్, తెల్లపూత, షుగర్, ఊపిరి తిత్తులు, తదితర వ్యాధులకు చికిత్స కోసం జిల్లాలోని 13 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరందరికీ ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తుంటారు. గత రెండు నెలలుగా తాళం వేసి ఉంటుండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
పెద్ద సంఖ్యలో రోగులకు సేవలందించే యునాని వైద్యశాలకు కనీస వసతులు కూడా లేవు. చాలా కాలంగా అంబేడ్కర్నగర్లోని ఓ అద్దె ఇంటిలో దవాఖానను ఏర్పాటు చేశారు. అది ప్రజలకు అందుబాటులో లేక పోవడంతో జిల్లా ప్రధాన దవాఖానకు మార్చి ఒక చిన్న గదిని కేటాయించారు. వైద్యుడు తప్ప రోగులు కూడా కూర్చునే వీలు లేని గదిని కేటాయించడంతో వైద్యులు, కాంపౌండర్ ఈ వైద్యశాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ఇక్కడి రోగులు రవాణా ఖర్చులు భరిస్తూ కరీంనగర్, సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తున్నది. మెరుగైన వసతులు కల్పించి, పూర్తి స్థాయిలో ఒక వైద్యుడు, కంపౌండర్లను నియమించాల్సిన అవసరం ఉంది.
యునాని వైద్యం కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. చాలా కాలంగా వైద్యుడు లేక కంపౌండరే వైద్యం అందించారు. ఈ మధ్యకాలంలో బదిలీల కారణంగా కంపౌండర్ కూడా బదిలీ అయ్యారు. దీంతో అప్పటి నుంచి గదికి తాళం వేస్తున్నారు. ఉచిత వైద్య సేవలందించే యునాని దవాఖానలో వైద్యుడిని నియమించేలా కలెక్టర్ చొరవ తీసుకోవాలి. అలాగే, ప్రత్యేక భవనం నిర్మించి సరిపడా వైద్యులను నియమించాలి.
– చింతోజు భాస్కర్, చైర్మన్ మానేరు స్వచ్ఛంద సంస్థ