కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఐదేండ్ల కింద గూడ్స్ వాహనం కొన్నాడు. ఇటీవల మరో పెద్ద గూడ్స్ వాహనం కొనాలని, పాత వాహనం అమ్మకానికి పెట్టాడు. మంచి బేరం కుదిరింది. కొనుగోలు చేసిన వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ బుక్ కోసం ప్రయత్నించగా సమస్య వచ్చింది. ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆ వాహన యజమాని చివరకు ప్రజావాణిలో సైతం అర్జీ పెట్టినట్లు సమాచారం. చేసేదేం లేక వాహన విక్రయ అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు.
తిమ్మాపూర్, నవంబర్ 7 : హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌తో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ లేని వారికి ఇక్కట్లు తప్పడం లేదు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో అధికారులు అవగాహన కల్పించక పోవ డం.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా మార్పిడి రిజిస్ట్రేషన్ల కోసం తంటాలు పడాల్సి వస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయాలతోపాటు హుజూరాబాద్, కోరుట్ల, రామగుండంలో ప్రాంతీ య కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో కొత్త వాహనం కొనే వారి నుంచి ప్రభుత్వమే రుసుం తీసుకొని, ఒక కోడ్‌తో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అందిస్తుంది. అయితే, వాటిని బిగించుకోకుండా ఉన్న వాహనాలు ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేలు ఉంటాయని అంచనా. వీరందరూ ఏదేని సమయం లో వాహనాన్ని అమ్ముకున్నా.. ఇతరుల పేర మీదకు మార్చాలన్నా సాధ్యం కావడం లేదు.
వీణవంక మండలానికి చెందిన ఓ రైతు ఐదేండ్ల కింద తన వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ కొన్నాడు. అప్పుడు తన అన్నకొడుకు పేర రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇటీవల తన పేరున మార్చుకుందామని ఆర్టీఏ వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకునేందుకు ఆన్లైన్ సేవా కేంద్రానికి వెళ్లాడు. అయితే, వాహనం కొన్న సమయంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేటును ట్రాక్టర్‌కు అమర్చి ఆన్లైన్ చేయించుకోలేదు. దీంతో ఇప్పుడా రైతు హై సెక్యూరిటీ ప్లేటు అమర్చుకుంటే తప్ప రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు.
ఏ వాహనం కొన్నా రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ సమయంలోనే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌కు ఆన్లైన్లోనే రుసుం తీసుకుంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ప్లేట్ ప్రింట్ అయ్యి కార్యాలయాలకు వచ్చేవి. ఇలా వచ్చే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఐదారేండ్ల క్రితం వరకు ఆర్టీఏ కార్యాలయాల్లోనే థర్డ్ పార్టీ సంస్థ ఆధ్వర్యంలో బిగించేవారు. అయితే, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం మరోసారి వాహనాన్ని ఆర్టీఏ కార్యాలయానికి తీసుకువచ్చేందుకు ఇబ్బందులు పడి బిగించుకోవడం లేదని గమనించిన ప్రభుత్వం.. వాహనం అమ్మిన డీలర్లకే ఆ వాహన నంబర్ ప్లేట్లను బిగించే ప్రక్రియను అప్పగించింది. అయితే, ఆ నంబర్ ప్లేట్ల ప్రాముఖ్యతపై చాలా మంది గ్రామీణ ప్రాంత వాహనదారులకు అవగాహన లేక బిగించుకోలేదు. డీలర్లు సైతం వాహనం తీసుకువచ్చి, అడిగిన వారికే బిగించారు. బిగించుకోని వారికి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఆ వాహనాల యాజమాన్య బదిలీలు నిలిచిపోతున్నాయి.
ఇలా నిలిచిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. వెరసి రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు, సిబ్బందిని బతిమాలాడినా వారి చేతిలో కూడా ఏమీ లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఈ సమస్య పెరిగిపోతుండడంతో రెండు నెలల కింద ఉన్నతాధికారులు ఓ కమిటీ వేయగా.. అది పరిష్కారానికి ఏ దారి చూపలేదు. అధికారులు చొరవ చూపి రిజిస్ట్రేషన్లు అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
ఇబ్బందులు చాలా మందికి నంబర్ ప్లేట్ ఎక్కడ బిగించుకోవాలో కూడా అవగాహన కల్పించడంలో అధికారులు, డీలర్లు విఫలమయ్యారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తుతుండడంతో డీలర్ల వద్దకు వెళ్తే తమ వద్ద లేవంటున్నారు. అటు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్తే డీలర్లకే పంపామంటున్నారు. వాహనానికి బిగించి ఆన్లైన్ చేయాల్సిన డీలర్ల నిర్లక్ష్యంతోనే ఇలా వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు.
వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా ప్రధానమైంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ ప్లేట్లు ఉంటేనే చెల్లుతాయి. కానీ, చాలామంది అవగాహన లేక నిర్లక్ష్యంతో ప్లేట్లను బిగించుకోలేదు. ప్రభు త్వం ముద్రించి ఇచ్చే ప్లేట్లను కాకుండా చాలా మంది స్టెల్‌గా కనిపించేలా ప్లేట్లు కొనుగోలు చేసి పెట్టుకుంటారు. సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు వివరించి, పరిష్కారానికి కృషి చేస్తా. ఇప్పటికైనా తప్పనిసరిగా నెంబర్ల ప్లేట్లను బిగించుకోవాలి.
– పెద్దింటి పురుషోత్తం, డీటీసీ