కొడిమ్యాల, జూలై 2: మొహర్రం వేడుకల్లో భాగంగా పులి వేషధారణ బొమ్మ కోసం వస్తూ బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఐ సందీప్ వివరాల ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన జడ గణేశ్ (21), దయ్యాల రాజు కుమార్ (22) స్నేహితులు. రాజు కుమార్కు వివాహం కాగా, కొద్దిరోజుల క్రితమే విడాకులయ్యాయి. ఉపాధి నిమిత్తం ముంబైలో ఉండగా, వారం క్రితమే గ్రామానికి వచ్చాడు. గణేశ్ గ్రామంలో గొర్రెలు, మేకల వ్యాపారం చేస్తున్నాడు.
మొహర్రం వేడుకల్లో భాగంగా పులి వేషానికి అవసరమైన పుర్రె బొమ్మ కోసం బుధవారం ఇద్దరూ కలిసి బైక్పై నల్లగొండ గ్రామానికి బయలుదేరారు. రాజు కుమార్ వాహనం నడుపుతున్నాడు. నల్లగొండ గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దాటిన అనంతరం మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. గణేశ్, రాజు కుమార్కు తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతి చెందారు. గణేశ్ తల్లి లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.