శంకరపట్నం : మండలంలోని వంకాయ గూడెం వద్ద గురువారం సాయంత్రం ఇన్నోవా కారు అదుపు తప్పి బీభత్సం(Road accident) సృష్టించింది. ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ ఆటో, బైక్, మరో టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండకు చెందిన గుడిపాటి భూపాల్ రెడ్డి తన ఆరుగురు కుటుంబ సభ్యులతో సొంత ఇన్నోవా కారులో కరీంనగర్ లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారు. శంకర్‌పట్నం మండలం వంకాయ గూడెం వద్దకు రాగానే ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఓ ప్యాసింజర్ ఆటో, టాటా ఏస్ వాహనాలను వేగంగా ఢీకొని గాల్లోకి లేచి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన బోల్తా పడింది.
ఈ క్రమంలో ప్యాసింజర్ ఆటో మరో బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్యాసింజర్ ఆటో నుజ్జు నుజ్జు అయింది. డ్రైవర్ మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన మార రమేష్ ను, బైక్ పై వస్తున్న శంషాబాద్ గ్రామానికి చెందిన మరో వ్యక్తి డొల్ల సతీష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మార రమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టాటా ఏస్ వాహనంలో డ్రైవర్‌తోపాటు స్కూల్ నుంచి కరీంనగర్ ఇంటికి వెళుతున్న ముగ్గురు టీచర్లు ఉండగా డ్రైవర్ పెర్క రాజమల్లుకు గాయాలయ్యాయి. కాగా సకాలంలో కారులో బెలూన్లు తెరుచుకోవడంతో పలువురికి ప్రాణాపాయం తప్పింది. నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.