పచ్చబంగారం పసుపు చిన్నబోయింది. ఆరుగాలం నమ్మి పంట వేసిన పంటకు డిమాండ్ తగ్గింది. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 22వేల ఎకరాల్లో సేద్యం చేయగా, కనీస గిట్టుబాటు రేటులేక ఆగమైపోతున్నది. గతేడాది క్వింటాల్‌కు 16వేల నుంచి 18వేలు పలికిన ధర, ఈ సారి సగానికి పడిపోయింది. దీంతో రైతాంగం దిగాలు చెందుతున్నది. పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టు కేంద్రం ప్రకటించినా భరోసా లేకపోవడంతో మండిపడుతున్నది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నది.
మెట్పల్ల్లి, మార్చి5: మార్కెట్లో ప్రస్తుతం పసుపు ధర రైతులను నిరాశకు గురిచేస్తున్నది. ఎన్నోఆశలతో సాగు చేసిన పంట ఉత్పత్తికి కనీస గిట్టుబాటు ధర లభించక దిగులు చెందుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఈ సంవత్సరం 22 వేల ఎకరాల మేర విస్తీర్ణంలో పసుపు పంటను సేద్యం చేశారు. అందులో ప్రధానంగా మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం,మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఎక్కువగా పంటను పండిస్తారు. ఒక్కో సారి షేర్ మార్కెట్‌ను తలపించేలా పసుపు ధర పలుకుతుంది. ఒక స్థిరమైన ధర అనేది లేకపోవడంతో ఎప్పుడు పెరుగుతుందో.. మరెప్పుడు అమాంతం తగ్గుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.
ఓ ఏడాది నష్టపోయిన మరో ఏడాదిలోనైనా ధర వస్తుందనే ఆశతో పసుపు పంటను సంప్రదాయ పంటగా అనేక మంది రైతులు చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో పంట సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, పంట విత్తనం మొదలుకొని పంట దిగుబడి వరకు సేంద్రియ, రసాయనిక ఎరువులు, క్రిమీసంహారక మందులు, కల్టివేటర్, పంట కోత, తవ్వకం, బాయిల్డ్ చేసి మార్కెట్‌కు తరలించడం దాకా ఎకరానికి కనీసం 70 వేలు ఆపై వ్యయం అవుతున్నది.
ప్రస్తుత సీజన్‌కు సంబంధించి పసుపు దిగుబడి వస్తుండగా, రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే పసుపు మార్కెట్లలో రాష్ట్రంలోనే నిజామాబాద్ తర్వాత మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ రెండోది అని చెప్పొచ్చు. ఇక్కడికి మెట్పల్లి, కోరుట్ల డివిజన్ల పరిధిలోని రైతులతోపాటు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీంగల్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, నిర్మల్ జిల్లా ఖానాపూర్, లక్ష్మణచందా, మామడ మండలాల నుంచి రైతులు తమ పంట ఉత్పత్తులను తీసుకొనివస్తారు.
అయితే ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న ధర పసుపు రైతులకు ఆందోళన కలిగిస్తున్నది. ‘పసుపు బోర్డు వచ్చింది. ఇక తమకు మంచి రోజులు వచ్చాయని’ భావించారు. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురవుతున్నది. గతేడాది క్వింటాల్ పసుపుకు 16 వేలు నుంచి 18 వేలు ధర పలికితే ఈ సారి సగానికి పడిపోవడం పసుపు రైతులను నిరాశపరుస్తున్నది. ఈ క్రమంలోనే రైతులు, రైతు ఐక్య వేదిక నాయకులు పసుపునకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మార్కెట్ ఇంటర్వేన్షన్ స్కీం (ఎంఐఎస్)కింద క్వింటాల్‌కు 15 వేలు మద్దతు ధర ప్రకటించి ఏదైనా ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పసుపు పంటకు ఈ సారి పసుపు ధర ఆశాజనకంగా లేదు. మార్కెట్లో వ్యాపారుల మధ్య పోటీ తత్వం లేకపోవడం, స్వల్ప సంఖ్యలో వ్యాపారులు ఆన్లైన్ వేలం పాల్గొనడం వల్ల బలమైన పోటీ ఏర్పడక పసుపు ధరలు తగ్గుతున్నాయి. గతేడాది క్వింటాల్‌కు 16 వేలు నుంచి 18 వేలు పలుకగా ఆ సారి సగానికి పడిపోయింది. ప్రస్తుతం పలుకుతున్న ధరలతో పంట సాగుకు పెట్టిన వ్యయం కూడా సమం కాలేక అప్పుల పాలుకావాల్సిన దుస్థితి రైతుకు ఏర్పడుతున్నది. క్వింటాల్‌కు కనీసం 15 వేలు మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నాఫేడ్తో, మరే ఏజెన్సీతోనైనా నేరుగా రైతుల నుంచి పసుపు కొనుగోలు చేయించాలి.
– మారు మురళీధర్‌రెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకుడు (వెల్లుల్ల)
ఎన్నికల ముందు పసుపు రైతులను ఆదుకుంటాం. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 15 వేలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో డిక్లరేషన్‌ను ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ డిక్లరేషన్‌ను అమలు చేయడం లేదు. మార్కెట్లో పలుకుతున్న పసుపు ధర రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పసుపు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి.
– యాళ్ల తిరుపతిరెడ్డి, రైతు (మేడిపల్లి పడమర)
పసుపు బోర్డు వచ్చిందని సంబురపడ్డాం కానీ, పసుపు పండించిన రైతుకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. బోర్డు ప్రారంభించిన్రు అయినా నిధులు మాత్రం కేటాయించకపోవడం దారుణం. మద్దతు ధర కోసం బోర్డు వాళ్లను అడిగితే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్రు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని మార్కెట్ ఇంటర్వేషన్ స్కీం కింద మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేయించి పసుపు రైతులను ఆదుకోవాలి.
– కాటిపల్లి నాగేశ్వర్‌రెడ్డి, రైతు (పెద్దాపూర్)