కరీంనగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని త్వరగా నిర్మించాలని సదరు దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడును మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో బీఆర్ నాయుడును కలిసి కరీంనగర్లో నిర్మించతలపెట్టిన దేవస్థానం గురించి వివరించారు.
2023 మేలో ఆలయ నిర్మాణానికి అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు అప్పటి మంత్రి గంగుల కమలాకర్ వేద పండితుల మధ్య వైభవంగా భూమిపూజ చేశారని, ఆ తర్వాత ఆలయ పనులు ముందుకు సాగలేదని చెప్పారు.
టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్లో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తామని అప్పటి అధికారులు హామీ ఇచ్చారని, అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించామన్నారు. ఇక్కడ శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తే అనేక జిల్లాల భక్తులకు కొంగుబంగారంగా మారే అవకాశముందని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చైర్మన్.. త్వరలో ఆలయ నిర్మాణం పనులు చేపడుతామని వినోద్‌కుమార్‌కు హామీ ఇచ్చారు.