Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జనవరి20 : ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో డ్యూటీ టైంలో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని ఫీడ్ బ్యాక్ అందుతుందని, వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కలెక్టరేట్లో గోదావరిఖని జనరల్ ఆసుపత్రి పని తీరుపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టర్ సమావేశమై మాట్లాడారు.
ప్రతీ డిపార్ట్మెంట్ వైద్యులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరై రోగులకు మంచి వైద్య అందించాలని ఆదేశించారు. ఔట్ పేషెంట్ సేవలు ఏ విభాగంలో తగ్గుతున్నాయో గమనించి రెగ్యులర్గా సమీక్షించుకోవాలన్నారు. వైద్యులు సెలవులను క్రమ పద్ధతులు వినియోగించుకోవాలన్నారు. నర్సింగ్, పారా మెడికల్, సెక్యూరిటీ సిబ్బంది రోగులు, రోగి సహాయకులతో వ్యవహరించే తీరు మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు.
సిబ్బంది హాజరు బయోమెట్రిక్ విధానంలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, గోదావరిఖని ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాల్ సింగ్, ఆర్ఎంవో కృప బాయ్, డాక్టర్ రాజు, డాక్టర్ అరుణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.