CPM Central Committee Member S Veeraiah | కోల్ సిటీ, సెప్టెంబర్ 5: అమెరికా అధ్యక్షుడు ట్రంపు బరితెగించి మాట్లాడుతూ భారత దేశ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నా మోడీ నోరు విప్పకపోవడంలో అంతర్యమేంటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య ప్రశ్నించారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సీపీఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రయోజనాలపై ట్రంప్ దాడి-భారత ప్రభుత్వ వైఖరి అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు.
దేశంలో ప్రజా సమస్యల పరిష్కారంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నిత్యవసర సరుకులు పెరిగి, విద్య, వైద్యం ఖర్చు భరించలేని స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే కులం, మతం పేరుతో దాడులు పెట్రేగడానికి మోడీనే కారణమని దుయ్యబట్టారు. రైతులకు ఎరువుల సరఫరాలోనూ విఫలమైందన్నారు. ఎన్నికల కమిషన్ ను అడ్డు పెట్టుకొని హర్యానా, మహారాష్ట్ర, యూపీ ఎన్నికల్లో తిమ్మిని బమ్మిని చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇందుకు పరాకాష్టగా బీహార్లో 85 లక్షల ఓటర్లను ఎస్ఐఆర్ పేరిట తొలగించిందని ఆరోపించారు. మన దేశం నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై 50 శాతం సుంకాలు విధించి ట్రంపు బెదిరిస్తున్నా మోడీ మౌనంగా ఉండటంలో అర్థం లేదన్నారు. దేశ ప్రజలకు మోడీ వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
లేదంటే దేశ ప్రజానీకంను జాగృతం చేసి పోరాటాలకు సిద్ధం చేస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ మహేశ్వరి అధ్యక్షతన జరిగిన సదస్సులో కార్యదర్శి వై యాకయ్య, వేల్పుల కుమారస్వామి, జ్యోతి, భిక్షపతి, బూడిద గణేష్, దొమ్మేటి కొమురయ్య, గిట్ల లక్ష్మారెడ్డి, రాజయ్య, సతీష్, మల్లయ్య, దీప, రజియా సుల్తానా, మంజుల, రమ, పైముద, కృష్ణకుమారి, పర్వీన్, రాధ, స్వరూప, లక్ష్మీ, ఆరెపల్లి రాజమౌళి, సందీప్, సురేశ్, శివరాంరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.