Degree college students | సిరిసిల్ల రూరల్, జూలై 2: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షే మహిళ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థినీలు రోడ్డెక్కారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలోని అంబేర్ విగ్రహం ఎదుట రహదారిపై బుధవారం సుమారు 50 మందికిపైగా బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ‘వీ వాంట్ మెటీరియల్స్.. వీ వాంట్ ఫ్యాకల్టీ’ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఉపేంద్రచారి, తహసీల్దార్ జయంత్, ప్రిన్సిపల్ జయ అక్కడకు చేరుకుని విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు.
అయినా వారు వినలేదు. ఈసందర్భంగా వారితో విద్యార్థులు వాగ్వావాదానికి దిగారు. కాగా ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు మూడు నెలలుగా మెటీరియల్స్ రావడం లేదని, ఫ్యాకల్టీ సైతం లేరని ఆందోళన వ్యక్తం చేశారు. మరో నెలరోజుల్లో పరీక్షలు ఉన్నాయని, మెటీరియల్ లేక క్లాసులు చెప్పే వారు లేకపోవడంతో పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రిన్సిపల్ జయ ఉన్నతాధికారితో మాట్లాడించగా విద్యార్థులు సదరు అధికారితో వాగ్వావాదానికి దిగడంతో పాటు పరీక్షలు ఎలా రాయాలి… మెటిరియల్స్ ఎప్పుడోస్తాయ్.. ఎప్పుడూ ఎదో ఒకటి చెబుతున్నారని ఎదురు ప్రశ్నించారు. మరో రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సుమారు గంట పాటు ఆందోళన కొనసాగడం గమనార్హం. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించి, క్లియర్ చేశారు. ఈ ఆందోళనలో కళాశాలలోని విద్యార్థులు ఉన్నారు.