Odela | ఓదెల, ఏప్రిల్4 : పట్టణాలను తలపించే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్వాహణను మరిచింది. ప్రకృతి వనాల్లో పెంచిన చెట్లకు కనీసం నీటిని కూడా పోయకపోవడంతో అవి ఎండిపోతున్నాయి.
పల్లెలు పట్టణాల వలె పార్కులు ఉండాలని తలపించి పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు. వాటిని ప్రస్తుత ప్రభుత్వం కాపాడలేక పోతోంది. మండలంలోని గోపరపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పల్లె ప్రకృతి వనంలోని చెట్లకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
గ్రామ పంచాయతీలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లను కూడా సమకూర్చింది. అయితే వాటిని సరిగా వినియోగించుకోవడం లేదని ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. పల్లె ప్రకృతి వనాన్ని ఆనుకొని చెరువులో నీరు కూడా సమృద్ధిగా ఉంది. అయినా ఇక్కడ చెట్లు ఎండిపోవడానికి గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. ప్రస్తుత వేసవికాలంలో పల్లె ప్రకృతి వనాల్లో చెట్లు ఎండిపోకుండా ప్రభుత్వం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.