వేములవాడ, జూలై 16: దేవాదాయ శాఖలో పరిపాలనా పరమైన ఉద్యోగులను మాత్రం బదిలీ చేస్తామని మొదటి నుంచి చెబుతున్నట్టుగానే 40 శాతం మంది ఉద్యోగుల బదిలీలకు కసరత్తు పూర్తయింది. ఇక రాజన్న ఆలయంలో 144 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా వీరి వివరాలను ఇప్పటికే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. ఈ నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కేడర్ స్ట్రెంత్‌ను గుర్తించారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న 63 మంది ఉద్యోగుల ఆధారంగా 40 శాతం బదిలీ అయ్యే కేడర్ వివరాలను వేములవాడ రాజన్న ఆలయ పరిపాలన కార్యాలయానికి పంపారు. పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా బదిలీ అయిన వారిని వెంటనే రిలీవ్ చేసి కొత్త వారిని తీసుకుంటామని ఇన్చార్జి ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రస్తుతానికి 6ఏ పరిధిలోని దేవాలయాలను ఒక యూనిట్‌గా చేసి బదిలీ ప్రక్రియ నిర్వహించనున్నారు. అందులో వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమురవెల్లి, భద్రాచలం, బాసర దేవాలయాలను కలిపి ఆరు దేవాలయాలుగా యూనిట్‌గా ఏర్పాటు చేశారు. ఈ ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆప్షన్ల ద్వారా ఈ ఆరు దేవాలయాల్లో ఎకడికైనా బదిలీ చేయవచ్చు.
రాజన్న ఆలయంలో కేడర్ స్ట్రెంత్ 77
వేములవాడ రాజన్న ఆలయంలో మొత్తం 214 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా.. 70 మంది ఉద్యోగ విరమణ పొంది ఖాళీలుగా ఉన్నాయి. 144 మంది ప్రస్తుతం పని చేస్తున్నట్టుగా ఉన్నతాధికారులకు ఆలయ అధికారులు నివేదికలు పంపారు. దీని ఆధారంగా రాజన్న ఆలయంలో కేడర్ స్ట్రెంత్‌ను అధికారులు డిసైడ్ చేశారు. అందులో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి 1, సహాయ కార్యనిర్వహణ అధికారులు 4, పర్యవేక్షకులు 14, సీనియర్ అసిస్టెంట్లు 19, జూనియర్ అసిస్టెంట్లు 33, ఈఈ 1, డీఈ 2, ఏఈ 1, ఏఈ సివిల్ 2గా కేడర్ స్ట్రెంత్ 77 మందిని గుర్తించారు. అందులో ప్రస్తుతం పని చేస్తున్న 63 మందిని గుర్తించి, వారిలో 40 శాతం మంది అనగా 25 మంది ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. 19వ తేదీతో ఆప్షన్లు ముగియనుండగా.. 20 నుంచి 27వ తేదీ వరకు కార్యాలయంలో పరిశీలించనున్నారు. 28, 29 తేదీల్లో బదిలీ ఉత్తర్వులను దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేయనున్నారు.
చర్చనీయాంశంగా బదిలీలు
రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ కొనసాగుతుండగా దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీల అంశం మాత్రం చర్చకు దారితీసింది. అయితే, ఉద్యోగులతోపాటు అర్చకులను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తుండగా, ఇప్పటికే అర్చక సంఘాల నుంచి వ్యతిరేకత మొదలైంది. మరోవైపు దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ భద్రాచలం అర్చకులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా, అర్చకుల బదిలీలపై స్టే ఇవ్వడంతోపాటు మూడు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని సంబంధిత శాఖను ఆదేశించిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర్వులు అందిన వెంటనే రిలీవ్ చేస్తాం
దేవాలయాల పరిధిలో జరుగుతున్న బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు అందిన వెంటనే ఉద్యోగులను రిలీవ్ చేస్తాం. పరిపాలన పరంగా ఇబ్బందులు కలుగకుండా వెంటనే రిలీవ్ చేసి వచ్చే శ్రావణమాసం సందర్భంగా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటాం. కేడర్ స్ట్రెంత్‌ను గుర్తించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పంపారు. బదిలీ ప్రక్రియను కూడా ఇప్పటికే నోటీసు బోర్డు ద్వారా ఉద్యోగులకు తెలియజేశాం.
– వినోద్ రెడ్డి, ఇన్చార్జి ఈవో (వేములవాడ)