ఒక నమ్మకమైన సంస్థగా, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా ఏర్పాటైన వారధి.. కొన్నేళ్లుగా ఔట్ సోర్సింగ్ (పొరుగు సేవల) ఉద్యోగుల ఏజెన్సీకి సంబంధించిన విధులను విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చింది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వారధి పరిధిలోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించి, ప్రైవేట్ ఏజెన్సీలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తున్నది. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి, తన అనుచర ప్రైవేట్ ఏజెన్సీకి ప్రయోజనం కలిగించేందుకు ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. మూడు నెలల క్రితమే పెద్ద సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా పరిధిలోని ప్రైవేట్ ఏజెన్సీ పరిధిలోకి బదలాయించినట్టు తెలుస్తుండగా, మూడు నెలలైనా ఒప్పందం చేసుకోకపోవడంతో వేతనాలు కూడా అందని పరిస్థితి నెలకొన్నది. దీనిపై ఉద్యోగులు ఆందోళన చెందుతుండగా, బదలాయింపుపై అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయలేని పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ప్రభుత్వాలు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. కొన్నేండ్ల తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలన్న డిమాండ్లను ముందుకు తీసుకురావడంతో ప్రభుత్వాలు చిక్కుల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి లావాదేవీలు లేకుండా, భవిష్యత్తులో తాత్కాలిక ఉద్యోగులతో న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఔట్ సోర్సింగ్ విధానం తీసుకువచ్చాయి. తర్వా త ఈ విధానంలోనూ మార్పులు చేస్తూ తాత్కాలిక ఉద్యోగులను ఏజెన్సీల ద్వా రా రిక్రూట్ చేసుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు రావని భావించి, ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి.
విద్య వైద్యం మొదలు అన్ని శాఖల్లోనూ ఇలా నియమించుకునే వ్యవస్థ తయారైంది. ఈ రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం ఎం ప్యానల్మెంట్ను విధానాన్ని రూపొందించింది. సంబంధిత ఏజెన్సీలు అందులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎం ప్యానెల్మెంట్ నిబంధన ల ప్రకారం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేసుకున్న ఉద్యోగులకు వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, తదితరమైన వాటిని సమకూర్చుతాయి. వీటికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వాలు నెలనెలా ఈ ఏజెన్సీలకు చెల్లిస్తాయి. వేతనంపై 8 శాతం కమీషన్‌ను ప్రభుత్వం ఏజెన్సీలకు అదనంగా చెల్లిస్తుంది. ఔట్ సోర్సింగ్ విధానంలో విపరీతమైన లాభాలు కనిపించడంతో అనేక ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యతలు పొందిన ఏజెన్సీలు ఈ ప్రక్రియలో అనేక అవకతవకలకు పాల్పడడం ప్రారంభించాయి. పోస్టుకు సంబంధించి అర్హతలు లేని ఉద్యోగులను నియమించడం, వారికి వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటివి చెల్లించకపోవడంతో అనేక సమస్యలు తలెత్తాయి.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఎంపిక, తదితర అంశాలన్నీ ఏజెన్సీల చేతుల్లో ఉండడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో నోటిఫై చేసి, ఆ పోస్టులకు సంబంధించిన ఎంపిక పూర్తి చేసిన తర్వాత వారి జాబితాను ప్రైవేట్ ఏజెన్సీలకు పంపించి, సంబంధిత శాఖ ఉన్నతాధికారి (ప్రిన్సిపల్ ఎంప్లాయర్)తో ఒప్పందం చేసుకునే పద్ధతిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రైవేట్ ఏజెన్సీలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను చెల్లిస్తూ వస్తున్నది. అలాగే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించి ఈపీఎఫ్, ఈఎస్ఐని సైతం ప్రభుత్వం, కార్మికుడి ఉమ్మడి భాగస్వామ్యంతో చెల్లిస్తూ వస్తున్నది.
అలాగే, ఎందరు ఉద్యోగులను ఏజెన్సీ కలిగి ఉందో వారికి సంబంధించిన ఒక నెల వేతనాన్ని ప్రభు త్వం వద్ద సెక్యూరిటీగా పెట్టాలని నిబంధన పెట్టింది. వేతనాల చెల్లింపు బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం, ఏజెన్సీలతో ఒప్పందాలు, ఉద్యోగుల మంచి చెడులు చూస్తే బాధ్యతను ఉపాధి కల్పన శాఖకు కట్టబెట్టింది. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ వ్యవస్థను కొంత సంస్కరించినా, చాలా చోట్ల ప్రైవేట్ ఏజెన్సీలు తమ పరిధిలోని ఉద్యోగులను దోపిడీకి గురిచేస్తూనే ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో ఈ యేడాది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వారధికి టాటా చెప్పి, ప్రైవేట్ ఏజెన్సీకి పెద్దపీట వేసినట్టు తెలుస్తున్నది. జిల్లాలోని వివిధ శాఖల్లో 400లకు పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా వారధి పరిధిలో 350కి పైచిలుకు, మరో 12 ప్రైవేట్ ఏజెన్సీల పరిధిలో మిగతా వారు పనిచేస్తున్నారు. వారధి పరిధిలోని వారికి ప్రతి నెలా ప్రభుత్వం నుంచి 3.50 కోట్ల వేతనాలను కలెక్టర్ ద్వారా చెల్లిస్తూ వస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లాకు చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వారధి పరిధి నుంచి తొలగించి, తనకు సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
కొద్దిరోజులపాటు అధికారులు ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయని, చెల్లింపులు సరిగా జరగకపోవచ్చని, 350 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రైవేటు ఏజెన్సీకి ప్రతి నెలా 8 శాతం కమీషన్ చెల్లించాల్సి వస్తుందని, ఇలా ఏటా దాదాపు 4 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని, వారధికి ఇచ్చే కమీషన్ ద్వారా చేసే కలెక్టరేట్ల కార్యనిర్వహణ, నిరుపేద విద్యార్థులకు సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని ప్రజాప్రతినిధికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. అయితే, సదరు కీలక ప్రజాప్రతినిధి ఎట్టి పరిస్థితిలోనూ కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న వారధికి ఇవ్వడానికి వీలు లేదని, తనకు సంబంధించిన ప్రైవేట్ ఏజెన్సీకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కేటాయించాలని పట్టుబడట్టంతో మూడు నెలల క్రితం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వారధి పరిధిలోని ఉద్యోగులందరినీ ప్రైవేట్ ఏజెన్సీ పరిధిలోకి బదలాయించారు.
వారధి నుంచి ప్రైవేట్ ఏజెన్సీ పరిధిలోకి మార్చడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. చాలా శాఖల పరిధిలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులు జిల్లా ఉన్నతాధికారులను కలిసి తమను వారధి పరిధిలోనే ఉంచాలని వినతిపత్రాలు ఇస్తూ ఇచ్చారు. అయినా, ప్రజాప్రతినిధి ఒత్తిడితో మార్పులు జరగడంతో ఉద్యోగులు, వారికి సంబంధించిన శాఖ అధికారులు (ప్రిన్సిపల్ ఎంప్లాయర్)లు సైతం ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకునేందుకు ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయం గురించి అడిగితే ఇంకా తమ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తమ శాఖ నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రెన్యువల్ రాలేదని, వచ్చిన తర్వాత ఒప్పందం చేసుకుంటామని చెబుతున్నట్టు తెలుస్తున్నది.
మూడు నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నా.. ప్రైవేట్ ఏజెన్సీతో చాలా శాఖలు ఒప్పందం చేసుకోకపోవడంతో ఉద్యోగులకు వేతనాలు సైతం అందని పరిస్థితి నెలకొంది. అయితే, మూడు నెలలకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన వేతన నిధులను ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లించినట్టు సమాచారం. ప్రిన్సిపల్ ఎంప్లాయర్‌తో ఒప్పందాలు కాకపోవడంతో ఉద్యోగులకు సంబంధించిన నెలరోజుల డిపాజిట్‌ను సైతం ప్రైవేట్ ఏజెన్సీలు చెల్లించలేదని, ఇది దేనికి దారితీస్తుందోనని జిల్లా అధికారులు వాపోతున్నారు. వారధికి బాధ్యతలు ఉన్నప్పడు తమకు ఇబ్బందులు లేవని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటోనని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన నీతూ కుమారి ప్రసాద్ ఏజెన్సీల దోపిడీకి చెక్ పెట్టేందుకు వారధి సంస్థను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, రిటైర్డ్ ఉద్యోగి కన్వీనర్‌గా ఈ వారధి పనిచేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో వారధి సంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, తదితర సౌకర్యాలు కల్పించే విషయంలో పూర్తి బాధ్యత తీసుకున్నది. ఏజెన్సీకి వచ్చే 8 శాతం కమీషన్‌ను సైతం స్వచ్ఛంద కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు వినియోగించాలని తీర్మానించారు. జిల్లాల పునర్విభజన తర్వాత సైతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సింహభాగం వారధి పరిధిలోనే ఉంటూ వచ్చింది.