Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 21: విద్యుత్ వినియోగదారులు సోలార్ విద్యుత్ ఆదా చేసినట్లయితే ఏడాదికి రూ.15 వేల వరకు ఆదాయం పొందవచ్చని, గృహాల నుండి రూ.5 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని ట్రాన్స్కో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో రూ.52 కోట్లతో ఏర్పాటు చేయనున్న మోడల్ సోలార్ ప్యానల్ ను శనివారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోలార్ ఉత్పత్తితో అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.
గృహాలకు ఐదువేల రూపాయలు, వ్యవసాయ బావుల వద్ద రైతులు రూ.15 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. వేసవిలో కరంటు ఉత్పత్తిని ఐదు నెలలు ఆదా చేసే అవకాశం ఉందని అన్నారు. సోలార్ ట్రాన్స్ఫార్మర్లలో ఆదా చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసినట్లయితే రేకుల షెడ్డు మాదిరిగా ఉండడంతోపాటు పొలాల వద్ద నీడలాగా ఏర్పడి రైతుల యూరియా బస్తాలు, ఇతరత్రా సామాన్లను సోలార్ ప్యానల్ కింద నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. సోలార్ ప్యానల్ ఉత్పత్తి కావాలంటే ప్రతీరోజు ప్యానల్ శుభ్రం చేస్తే ఉత్పత్తి మరింత ఎక్కువగా పొందే అవకాశం ఉందన్నారు.
దుమ్ము ధూళి తో పాటు సోలార్ ప్యానల్ పై మట్టి పడకుండా ప్రతీరోజు జాగ్రత్త తీసుకోవాలన్నారు. 240 యూనిట్లకు పైగా సోలార్ ఉత్పత్తి అవుతుందన్నారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయ భూముల వద్ద గృహాలకు గాను త్వరలోనే సోలార్ ప్యానల్ ను త్వరలోనే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1164 గృహాలకు, 921 వ్యవసాయ కరెంటు వినియోగం గా గుర్తించగా, ఇప్పటివరకు 243 మొదటి విడతగా సోలార్ ప్యానల్ ను పూర్తి చేసినట్లు తెలిపారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ లను పరిశీలించారు. ఆయన వెంట డీఈలు తిరుపతి, ఉపేందర్, ఏడీఏ నరేందర్, రెడ్కో డిస్టిక్ మేనేజర్ మనోహర్, ట్రాన్స్కో, రెడ్కో ఏఈలు ప్రకాష్, అన్వేష్, లక్ష్మీ కాంతారావు, మునీందర్, సర్పంచ్ అల్లెపు సంపత్, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.