Local body elections | ధర్మారం, సెప్టెంబర్ 26: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారుల (పీవో) లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థలు ఎన్నికలు -2025 అంశంపై ధర్మారం, ఎలిగేడు జూలపల్లి మండలాల్లోని 252 మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డి ఎల్ పి ఓ వీ వేణుగోపాల్, ఎంపీడీవో అయినాల ప్రవీణ్ కుమార్, ఎంఈఓ పోతు ప్రభాకర్, ఎంపీ ఓ కే రమేష్, ట్రేనర్ ఆఫ్ ట్రైనీలు ( టీఓటీ)లు కె కృష్ణారెడ్డి, ఎన్ రాజేందర్ రెడ్డి తదితరులు హాజరైనారు.
ఈ సందర్భంగా టి ఓ టి లు కృష్ణారెడ్డి, రాజేందర్ రెడ్డి సంయుక్తంగా ప్రిసైడింగ్ అధికారులకు త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల నిర్వాణ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని వారి వివరించారు. ఇందులో ఒక దశలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక, రెండవ దశలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఇట్టి ఎన్నికలు ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి ప్రిసైడింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని వారు సూచించారు.
ఓటరు ఓటు వేసే విధానం గురించి వారు సమగ్రంగా వివరించారు. ప్రతి ఓటరు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు తప్పనిసరిగా పెట్టాలని తద్వారా మరో ప్రాంతంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేయకుండా నివారణ చేయబడుతుందని మాస్టర్ ట్రేనర్లు కృష్ణారెడ్డి ,రాజేందర్ రెడ్డి వివరించారు. బ్యాలెట్ బాక్స్ ఓపెనింగ్, సీల్ చేయడం గురించి వారు అవగాహన కలిగించారు. సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు ఉంటాయని వాటిని ఓటర్లకు వివరించాలని పిఓలకు వారు వివరించారు. అనంతరం పిఓ లకు ఎన్నికల శిక్షణ పత్రాలను అధికారులు అందజేశారు.