కార్మికలోకం ఏకమైంది. కేంద్రంలోని మోదీ సర్కారుపై సమరానికి సై అంటున్నది. బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది. దశాబ్ధాలుగా కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశంలోని 9 కేంద్ర, 2 ప్రాంతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా పిలుపునివ్వగా, కదనరంగంలోకి దూకేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నది.
ఆందోళనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు రంగాలకు చెందిన సంఘటిత, అసంఘటిత కార్మికులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు సుమారు 3.50 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉండగా, వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలతోపాటు బీఆర్ఎస్ కార్మిక విభాగం కూడా పాల్గొంటున్నది.
కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతులను నిర్వీర్యం చేసే నూతన వ్యవసాయ విధానాలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సై అంటున్నారు. ఎన్నో దశాబ్ధాలపాటు పోరాటాలు చేసి సాధించుకున్న తమ హక్కులను కాలరాయడంపై భగ్గుమంటున్నారు.
గురువారం నుంచి పోరుబాట పడుతున్నారు. ముఖ్యంగా కార్మికులు సాధించుకున్న హక్కులో ప్రధానమైనది సంఘటితం కాగా, అందుకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి సంఘటితం కాకుండా కేంద్రం చట్టాలు చేయడంపై ఆగ్రహిస్తున్నారు. ఈ కోడ్స్ రద్దయ్యే వరకు నిరంతర పోరాటాలు చేసేందుకు సిద్ధమయ్యారు. బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర నిర్ణయాలు తీసుకుంటున్నదని, ఇటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు.
ముఖ్యంగా సమ్మెలో బీఆర్ఎస్ కార్మిక విభాగంతోపాటు వామపక్ష పార్టీలైన అనుబంధ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొననుండగా, సింగరేణి, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రక్షణ శాఖ బ్యాంకింగ్ ఫెడరేషన్, రైల్వే ఉద్యోగులు సైతం సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా 11 ట్రేడ్ ఫెడరేషన్లు సంయుక్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.
సమ్మెను విజయవంతం చేసేందుకు బీఆర్టీయూతోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ వంటి కార్మిక సంఘాలు ఐకమత్యంగా కృషి చేస్తున్నాయి. సింగరేణి, ఎన్టీపీసీ ఉద్యోగులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, ఉపాధి హామీ కూలీలు కూడా ఈ సమ్మెలో పాల్గొనేలా చేసేందుకు సీఐటీయూ, బీఆర్టీయూ తదితర కార్మిక సంఘాలు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రమాదంలోకి కార్మికరంగం
ఎందరో కార్మికులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న రోజుకు 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటలకు పెంచేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్‌ను రూపొందించిందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కోడ్ వల్ల కార్మికులకు ఎలాంటి రక్షణ లేకపోగా, గొడ్డలి పెట్టుగా మారుతుందని వాపోతున్నారు. నాలుగు లేబర్ కోడ్లతో ప్రభుత్వ రంగ సంస్థలను నేషనల్ మ్యానిటైజేషన్ విధానం ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ఆలోచనలో కేంద్రం ఉందని ఆరోపిస్తున్నారు.
2020 నుంచి 2023 వరకు యాజమాన్యాల లాభాల వాటా 38 శాతం నుంచి 51 శాతానికి పెరిగితే కార్మికుల జీతాల వాటా మాత్రం 18 నుంచి 15 శాతానికి తగ్గించారని వాపోతున్నారు. కొత్త కార్మిక కోడ్ల వల్ల కార్మికరంగం ప్రమాదంలోకి పోతుందని, పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండానే యథేచ్ఛగా కార్మికులను తొలగించే ముప్పు ఉంటుందని, కార్మికులకు తమ యూనియన్ నాయకత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండదని, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటు రిజిస్ట్రేషన్లు కఠినతరం చేస్తున్నారని, కొత్తగా వచ్చే నాలుగు లేబర్ కోడ్‌తో కార్మికులకు సమ్మె చేసే అవకాశం కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సామాజిక భద్రత కోడ్ అమలు వల్ల ఉద్యోగులు పొందే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 నుంచి 10 శాతానికి తగ్గుతుందని, భవిష్యత్తులో కార్మికులకు ఈపీఎఫ్ సదుపాయం కూడా ఉండదని, ఈఎస్ఐ సదుపాయం కూడా తగ్గుతుందని వాపోతున్నారు.
లేబర్ కోడ్ రద్దుకు డిమాండ్
శతాబ్ధకాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్‌ను తేవడం ద్వారా కార్మికవర్గం పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదమున్నది. కార్మిక సంఘాల ఏర్పాటుకు అవకాశం ఉండదు. సమష్టి బేరసారాల శక్తి నిర్వీర్యమవుతుంది. కార్మికులు ఉపాధి, ఉద్యోగ భద్రత కోల్పోవడమే కాదు, కార్మిక శాఖ కూడా నిర్వీర్యమయ్యే ముప్పున్నది. ఈ నేపథ్యంలో ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్స్ రద్దుతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వేలు, విమాన సేవలు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్, బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్టర్మ్ ఎంప్లాయిమెంట్, అప్రెంటీస్ తదితర విధానాల్లో వివిధ పథకాల కింద పనిచేస్తున్న కార్మికులెవరినీ క్యాజువలైజ్ చేయద్దు విన్నవిస్తున్నారు. ఇంకా అందరికీ ఉచిత విద్యా, వైద్యం, నీరు అందుబాటులోకి తేవాలని, అందరికీ గృహ నిర్మాణ అనుమతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
పరిశ్రమలకు సమ్మె నోటీసులు
దేశవ్యాప్తంగా గత మే 20న సమ్మె జరగాల్సి ఉంది. కానీ, పహల్గాం దాడి నేపథ్యంలో సమ్మెను ఈ నెల 9కి వాయిదా వేశారు. అయితే సమ్మెలో పాల్గొంటున్న కార్మిక సంఘాలకు మరింత వెసులుబాటు దొరికింది. దీంతో విస్తృతంగా కార్మిక సంఘాలతో సమావేశాలు, సభలు నిర్వహించాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లాలోని రైస్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమల యాజమానులు, హరిత బయో ప్రొడక్ట్ కంపెనీకి, ప్రియా మిల్స్ డెయిరీ, నాగార్జున మిల్క్ డెయిరీ, సీడ్స్ మిల్స్, జిన్నింగ్ మిల్స్, ఆటోమొబైల్ షోరూంలు, డీ మార్ట్, ప్లిప్ కార్డులు, మోర్ సూపర్ మార్కెట్లు తదితర షాపింగ్ మాల్స్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు.
చట్ట ప్రకారం సమ్మెకు 14 రోజుల ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఒక్క యూనియన్ ఆధ్వర్యంలోనే 183 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని సీఐటీయూ బాధ్యుడు ఎడ్ల రమేశ్ తెలిపారు. ఒక్క కరీంనగర్ జిల్లా నుంచి లక్షకుపైగా కార్మికులు సమ్మెలో పాల్గొనే విధంగా సన్నద్ధం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, హమాలీ, ట్రాన్స్పోర్ట్ రంగం, మెడికల్ అండ్ హెల్త్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొంటున్నారు.
పెద్దపల్లి జిల్లాలో సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ ఉద్యోగులు, రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగులు, సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా ఉన్న పవర్‌లూం కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఒక రోజు సమ్మెలో ఆర్టీసీ కూడా పాల్గొంటుండగా టీఎన్జీవోలు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షలకుపైగా కార్మికులు, వివిధ రంగాల ఉద్యోగులు పాల్గొంటున్న నేపథ్యంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నది.
సింగరేణి కార్మికులు సై
దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కాలరీస్ కంపెనీలో సమ్మె సైరన్ మోగబోతున్నది. దశాబ్దాల కిందే కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడం, అవి కార్మికవర్గానికి గొడ్డలి పెట్టుగా మారబోతుండగా కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలని, బొగ్గు గనుల వేలాన్ని ఆపి కోలిండియా, సింగరేణి సంస్థలకు కేటాయించాలని, సింగరేణి ప్రైవేటీకరణ నిలిపివేయాలని, 44 కార్మిక హక్కులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌తో ఈ నెల 9న సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు.
సమ్మె విజయవంతం అవుతుంది
కార్మిక సమాఖ్యలు 9న చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమవుతుంది. అన్ని రంగాల కార్మికులు, పలు ప్రభుత్వ రంగాల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనేందుకు రెడీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న నాలుగు లేబర్ కోడ్లు పూర్తిగా రద్దు చేయాలి. కార్మికులకు హాని కలిగించే ఎలాంటి చట్టాలను అమలు చేయరాదనేది మా ప్రధానమైన డిమాండ్. కరీంనగర్ జిల్లాలో లక్ష మందికిపైగా పాల్గొనే అవకాశం ఉన్నది. ఉమ్మడి జిల్లాలో అయితే 3 లక్షల 50 వేల మంది పాల్గొనవచ్చు. సమ్మె జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.
– ఎడ్ల రమేశ్, సీఐటీయూ బాధ్యుడు
ప్రధాన డిమాండ్లివే..
నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి
కనీస వేతనం 26 వేలు చెల్లించాలి
పని హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలి
సమాన పనికి సమాన వేతనం అందించాలి
కనీస పెన్షన్ 9 వేలు ఇవ్వాలి సామాజిక భద్రత కల్పించాలి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి
ఎన్ఎస్పీ, యూఎస్పీ విధానం రద్దు చేయాలి
బోనస్ ఫ్రావిడెంట్ ఫండ్ చెల్లించాలి
అర్హతపై సీలింగ్‌లను తొలగించాలి గ్రాట్యూటీ మొత్తాన్ని పెంచాలి 45 రోజుల్లో యూనియన్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి
విద్యుత్తు సవరణ బిల్లు రద్దు చేయాలి