సారంగాపూర్, నవంబర్ 12: పల్లె ప్రగతిలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసింది. ప్రతి ఇంటి నుంచి తడి, పోడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి డంప్‌యార్డుకు తరలించేది. దీంతో ప్రతి పల్లె పరిశుభ్రంగా ఉండేది. అయితే రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజా పాలనను గాలికొదిలేసింది. కొన్ని గ్రామాల్లో సరైన మెయింటనెన్స్ లేకపోవడంతో జీపీ ట్రాక్టర్లు మూలన పడగా, పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. సారంగాపూర్ మండలం ఒడ్డెరకాలనీ గ్రా మానికి గత బీఆర్ఎస్ సర్కారు ట్రాక్టర్‌ను మంజూరు చేసింది.
చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ ఉన్నప్పటికీ.. నిర్వహణకు డబ్బులు లేకపోవడంతో దానిని వినియోగించడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బంది కాలనీల్లో ఊడ్చిన చెత్తను గ్రామంలో తాటికమ్మలపై తరలించడం కనిపించింది. జీపీ ట్రాక్టర్ నిర్వహణకు నిధులు లేక రెండేండ్లుగా ట్రాక్టర్‌ను వాడడం లేదని, సిబ్బంది తాటి కమ్మలపైనే చెత్తను గుంజుకెళ్తున్నారని మాజీ సర్పంచ్ పల్లపు వెకంటేశ్ తెలిపారు. మూడేండ్ల క్రితం జీపీ ఆధ్వర్యంలో సుమారు రూ.5లక్షలతో పనులు చేపడితే నేటికీ బిల్లులు ఇవ్వడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇన్చార్జి కార్యదర్శి ఇంతియాజ్‌ను వివరణ కోరగా, గ్రామ పంచాయతీలో నిధుల కొరతతో రెండేండ్లుగా ట్రాక్టర్‌ను వాడడం లేదని చెప్పారు. నిధులు లేకపోవడంతో ట్రాక్టర్ మరమ్మతులు చేయడం లేదని, అందువలన వాడడం లేదని చెప్పారు.