Odela | ఓదెల, జూన్ 18 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన ఐలు భిక్షపతి గౌడ్ (55) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పైనుండి కిందపడి గురువారం సాయంత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గీత వృత్తిలో భాగంగా భీమరపల్లిలో తాటి చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు మోకుజారి కింద పడ్డాడు.
ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజన, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన భిక్షపతి గౌడ్ తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందడంతో ఓదెలలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.