యువ సారథి, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం పెద్దపల్లి జిల్లాకు రానున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి పర్యటించనున్నారు. మొదట రామగుండం నియోజకవర్గంలో 210 కోట్ల పనులకు, పెద్దపల్లిలో 150 కోట్ల పనులకు అంకురార్పణ చేయనున్నారు. ఖురూజ్కమ్మీ భూములకు సంబంధించి 600 మంది పెద్దంపేట్, రాయదండి ప్రజలకు హక్కు పత్రాలు అందిస్తారు. 58, 59,76 జీవోల ద్వారా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు, ఆసరా పింఛన్లు, గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, దళితబంధు, మైనార్టీ బంధు చెక్కులు పంపిణీ చేస్తారు. ఆయాచోట్ల సభల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనుండగా, మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
– పెద్దపల్లి, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు వచ్చి, మధ్యాహ్నం వరకు అక్కడే పర్యటిస్తారు. ఆ తర్వాత 2 గంటలకు రామగుండం చేరుకుంటారు. మంత్రి కొప్పు ల ఈశ్వర్, మండలి చీఫ్ విప్ భానుప్రసాద్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానితో కలిసి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ రామగుండం నియోకవర్గంలో 210 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు, పెద్దపల్లిలో 150 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు అంకురార్పణ చేయనున్నారు. గోదావరిఖనిలో రామగుండం దశాబ్ది ప్రగతి సభతోపాటు పెద్దపల్లిలో ప్రగతి నివేధన సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
రామగుండంలో 210కోట్ల అభివృద్ధి పనులకు..
మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా రామగుండం నియోకవర్గంలో 210 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు అంకురార్పణ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రామగుండానికి రానున్న ఆయన, ముందుగా గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూస్టేడియానికి చేరుకుంటారు. గోదావరిఖనిలో ఐటీ టవర్, అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణ పనులకు సంబంధించి అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 100 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల పైలాన్‌తోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఖురూజ్కమ్మీ భూములకు సంబంధించి 600 మంది పెద్దంపేట్, రాయదండి ప్రజలకు హక్కు పత్రాలు అందిస్తారు. జీవో 76 ద్వారా సింగరేణి స్థలాల్లో అనేక ఏండ్లుగా జీవిస్తున్న కుటుంబాలకు, 58, 59జీవో ద్వారా మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ స్థలాల్లో అనేక ఏండ్లుగా నివాసముంటున్న వారికి ఇంటి పట్టాలు అందిస్తారు. అలాగే, గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, 3425 మందికి 4వేల చొప్పున ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ‘రామగుండం దశాబ్ది ప్రగతి సభ’లో పాల్గొని ప్రసంగించనున్నారు.
పెద్దపల్లిలో 150కోట్ల పనులకు..
రామగుండం పర్యటన తర్వాత సాయంత్రం 4 గంటలకు మంత్రి కేటీఆర్ పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడే 150 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు శంకుస్థాపన చేస్తారు. మొదటగా ఆర్అండ్బీ రోడ్ల శిలాఫలకం ఆవిష్కరిస్తారు. కోటితో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిచనున్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 25 కోట్ల టీఎఫ్ఐడీసీ నిధులతో రోడ్లు, డ్రైనేజీల పనులను ప్రారంభిస్తారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని 50 లక్షల నిధులతో నిర్మించిన అమర్‌నగర్ జంక్షన్, రోడ్ డివైడర్స్, సెంట్రల్ లైటింగ్స్‌ను ఆయన ప్రారంభించనున్నారు. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో 25 కోట్ల టీఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, 100 కోట్లతో నిర్మించనున్న పనులను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందజేస్తారు. ఆ తర్వాత మున్సిపల్ చెత్త వాహనాలను ప్రారంభిస్తారు. అనంతరం ‘ప్రగ తి నివేదన సభ’లో మంత్రి కేటీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించి, హైదరాబాద్ వెళ్లి పోనున్నారు.
ముస్తాబైన రామగుండం, పెద్దపల్లి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటనకు రామగుండం, పెద్దపల్లిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయాచోట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఆయా పట్టణాలు అందందా ముస్తాబయ్యాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లు, ఫెక్సీలతో దారులు, కూడళ్లు గులాబీమయమయ్యాయి. పెద్దపల్లి, రామగుండంలో సభా స్థలి ఆవరణలను జెండా లు, ఫ్లెక్లీలతో అలంకరించారు.