మల్యాల, డిసెంబర్ 12 : ఎప్పటిలాగే నిద్రపోయిన ఆ యువకుడు అనుకోని రీతిలో అగ్నికి ఆహుతయ్యాడు. ఊహించని విధంగా అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు అంటుకొని మృత్యుఒడికి చేరాడు. మల్యాల ఏఎస్ఐ రుద్ర కృష్ణకుమార్ వివరాల ప్రకారం.. మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన గాతం తిరుపతి (37) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు గ్రామంలోనే మరోచోట నివసిస్తుండగా, తిరుపతి శిథిలావస్థలో ఉన్న పెంకుటింట్లో ఉంటున్నాడు.
రోజువారీలాగానే బుధవారం రాత్రి ఆ ఇంట్లో ఒంటరిగా పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటి పైకప్పు కూలడంతో విద్యుత్ వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఇల్లంతా మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న తిరుపతికి అంటుకోవడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మంటలతోపాటు దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల వారు గమనించి, తల్లిదండ్రులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులతోపాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే తిరుపతి చనిపోయాడు. తిరుపతి తల్లి దేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.