DCP Bhukya Ram Reddy | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 8 : పెద్దపల్లి జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా బందోబస్తు చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జోన్ డీసీపీ భూక్యా రాం రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల శివారులోని పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తో కలిసి సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా రౌడీ షీటర్ ల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎన్నికల వేళ ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీస్ వ్యవస్థ అలర్ట్ గా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వద్దన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేయాలని, డబ్బు, మద్యం పంపిణీ జరుగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో నిఘా ఉంచాలన్నారు. పోలింగ్ స్టేషన్ ల పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. డీసీపీ వెంట పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్, సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.