Tiger | కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో మంగళవారం రైతులు పులి పాదముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలుగా నిర్ధారించి సమీప గ్రామాల వాసులను అప్రమత్తం చేసి యువకులతో గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు. అటవీ శాఖ అధికారులు పులి సంచారాన్ని గుర్తించేందుకు బుధవారం ఉదయం నుంచి అన్వేషణ సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పులి పాద ముద్రలను చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గుర్తించినట్లు కరీంనగర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి షౌకత్ హుస్సేన్ తెలిపారు.
రుక్మాపూర్ శివారులకు వచ్చిన పులి ఇక్కడి నుంచి పాదముద్రల ఆధారంగా ఎటువైపు వెళ్లి ఉంటుందనే దానిపై పరిశీలన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సాధారణంగా పులి ఆహారం కోసం వేట సాగించే క్రమంలో రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం జిల్లాలో పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ఎక్కడా కూడా దట్టమైన లేదా పులి లాంటి మృగాలు తిరిగేందుకు అంతగా అనువైన ప్రాంతాలు లేవని, అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలోకి ప్రవేశించిన మృగరాజు తోడును వెతుక్కునే క్రమంలో దాని పాత పరిధిని దాటి బయటకు వచ్చి దారి తప్పి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పులి అడుగుల ఆధారంగా ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉందా..? లేదా..? దాని దిశను మార్చుకుని సమీప మండలాల మీదుగా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి మంచిర్యాల వైపు వెళ్లే అవకాశాలు ఉండవచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.