Tiger | మంథని రూరల్ : మంథని మండలం బిట్టుపల్లి గ్రామం వైపు శనివారం రాత్రి వెళ్ళిన పెద్దపులి తిరిగి ఆదివారం తెల్లవారుజామున గోపాల్పూర్ వైపు మళ్ళినట్లు ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు. బిట్టుపల్లి వైపు పెద్దపులి వెళ్ళిన సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు రాత్రంతా బిట్టుపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు ప్రజలు ఎవరు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున బిట్టుపల్లి నుండి గోపాల్పూర్ వైపు వెళ్లిన పెద్దపులి అడుగులను గోపాల్పూర్ కాలువ పక్కన దాని అడుగులను గుర్తించారు. పెద్దపులి తమ గ్రామాల సమీపంలో నుంచి ప్రయాణించడంతో బిట్టుపల్లి గోపాల్పూర్, ధర్మారం, చిన్నఓదేల ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ రమేష్ మాట్లాడుతూ.. ప్రజలు ఎవరు ఒంటరిగా తమ పంటపొలాలకు వెళ్ళవద్దన్నారు. ఉపాధి హామీ కూలీల సైతం పులి సంచారం ఉన్న నేపథ్యంలో పనులకు వెళ్ళవద్దని సూచించారు. అదే విధంగా పులికి ఎలాంటి హానిచేయొద్దని తెలిపారు. పులికి హాని చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎవరైనా తమ పంటపొలాలకు రక్షణగా విద్యుత్ వైయులు అమర్చినట్లయితే వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. పులిజాడ తెలిసేంతవరకు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు ఒంటరిగా వెళ్లవద్దన్నారు. పులి జాడ కోసం ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది అడివిలో పులి జాడను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.. పులిజాడను తొందరగా గుర్తించి తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.