కరీంనగర్, మే 16 (నమస్తే తెలంగాణ) : జల్సాలకు అలవాటు పడ్డ ఓ ముగ్గురు యువకులు, అమ్మాయి పేరిట ఓ యువకుడికి వల వేశారు. కామవాంఛ తీరుస్తానంటూ రప్పించి దోపిడీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను కొత్తపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి సమక్షంలో కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి శుక్రవారం అరెస్ట్ చూపారు. వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలంలోని చింతకుంట శాంతినగర్‌కు చెందిన సరళ సందీప్ (19), లక్ష్మీపూర్‌కు చెందిన తన స్నేహితులు పొన్నాల ప్రణయ్ కుమార్ (18), ఎండీ రహమాన్ జాల్సాలకు అలవాటు పడ్డారు. అమ్మాయిల ఎర చూపి దోపిడీకి పాల్పడాలని కొత్త పథకం వేశారు. ఈ నెల 6న సందీప్ మంచిర్యాల ప్రాంతానికి చెందిన హరిబాబు (25)కు ‘హాయ్.. ఐయామ్ పూజ’ అంటూ మెస్సేజ్ చేశాడు. హరిబాబు స్పందించి చాటింగ్ చేయడంతో కామవాంఛ తీర్చుతానంటూ ఎరవేశాడు. అందుకు కరీంనగర్ రావాలని చాటింగ్‌లో సూచించాడు.
ఇది నమ్మిన హరిబాబు ఈ నెల 11న కరీంనగర్‌కు వచ్చి, తాను చాటింగ్ చేసిన నంబర్‌కు ఫోన్ చేశాడు. వారు కొత్తపల్లికి రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లాడు. అయితే ఆ ముగ్గురు యువకులు ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం.. ఎండీ రహమాన్ వెలిచాల శివారులోని పంట పొలాల్లో ఉన్నాడు. మిగతా ఇద్దరు యువకులు హరిబాబును బైక్‌పై అక్కడికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. 50 వేలు కావాలని డిమాండ్ చేశారు. దీంతో హరిబాబు తన వద్ద ఉన్న 10 వేలు ఇచ్చాడు. బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి, మరో 12 వేలు ఫోన్ పే ద్వారా తెప్పించుకుని ఫోన్‌కు పంపించాడు. దీంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడు హరిబాబు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ సాంబమూర్తి ఆధ్వర్యంలో పోలీసుల బృందం గాలించారు. శుక్రవారం రేకుర్తి బస్టాండ్‌లో ఇద్దరు యువకులను గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉండగా సందీప్, ప్రణయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. కాగా, ప్రధాన నిందితుడు సందీప్ గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడి వరంగల్‌లోని జూవైనల్ హోంలో శిక్ష అనుభవించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.