సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 13: ‘సిరిసిల్ల గడ్డ.. కేటీఆర్ అడ్డా’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రదాతకు కార్మిక క్షేత్రం మరోసారి అండగా నిలించిందని, బీఆర్ఎస్ పదేళ్లత సంక్షేమానికి మూడోసారి మున్సిపల్ విజయాన్ని కానుకగా అందించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అక్రమ కేసులు బనాయించినా సిరిసిల్ల ప్రజలు ఎక్కడా బెదరలేదని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమ్మకంతో కారు గుర్తుకు జై కొట్టారని చెప్పా రు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆగయ్య మాట్లాడారు. కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసి నేతన్నలు, స్థానిక ప్రజలందరూ బీఆర్ఎస్కు ఓట్లు వేశారని చెప్పారు.
అధికార పార్టీ నాయకులు, మంత్రులు వచ్చి బెదిరింపులకు గురి చేసినా నేత కార్మికులు భయపడకుండా వారి మొఖం మీద కొట్టినట్లు తీర్పు ఇచ్చారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమ మాట్లాడుతూ, మున్సిపల్ ఫలితాలతో కేటీఆర్ అంటేనే సిరిసిల్ల.. సిరిసిల్ల అంటేనే కేటీఆర్ అని ప్రజలు మరోసారి రుజువు చేశారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసిన ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారన్నారు. మెజార్టీ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు అండగా నిలిచిన స్థానిక ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలతో మమేకమై రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని ఆకాంక్షించారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, నాయకులు మ్యాన రవి, బొల్లి రామ్మోహన్, ఎండీ సత్తార్, నూతన కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.