సిరిసిల్ల టౌన్, జూన్ 14: ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఫార్ములా-ఈ రేస్ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. పాలన చేతగాని రేవంత్‌రెడ్డిని ప్రజా క్షేత్రంలోకి వెళ్తే ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిండని ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు రావాలని కేటీఆర్ తాజాగా సవాల్ విసిరిన విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ ఇప్పటికైనా కేటీఆర్ సవాల్‌ను స్వీకరించి లై డిటెక్టర్ పరీక్షకు హాజరై తన పవిత్రతను చాటుకోవాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా-కారు రేస్‌తో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని, రాష్ర్టానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాజకీయంగా కేటీఆర్‌ను ఎదుర్కొనలేని ప్రభుత్వం ఏసీబీ నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టాలని చూస్తుందన్నారు. పాలకుర్తి, మహబూబాబాద్ ప్రాంతాల్లో ప్రజలు హామీల అమలుపై ఎమ్మెల్యేలను తరిమికొడుతున్నారని, కాంగ్రెస్ నేతలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ పనులకు వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు. రైతు బీమా ద్వారా కుటుంబాలకు అండగా నిలిస్తే, రేవంత్‌రెడ్డి సదరు బీమా కంపెనీకి డబ్బులు చెల్లించకుండా పథకాన్ని తొక్కి పెడుతున్నదని ఆగ్రహించారు.
కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు సన్నాలకు బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు రూ.10 వేలు, ఇంటర్ చేసిన వారికి రూ.15వేలు, డిగ్రీ పాసైన వారికి రూ.25వేలు, పీహెచ్డీ పూర్తయిన వాళ్లకు రూ.లక్ష వరకు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలన్నారు. రైతులు, ప్రజలు, విద్యార్థులందరి నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ఏసీబీ నోటీసుల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిండన్నారు. సమావేశంలో నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, బండ నర్సయ్యయాదవ్, కుంబాల మల్లారెడ్డి, గుండారపు కృష్ణారెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, దిడ్డి రాజు, దార్ల సందీప్, రిక్కుమల్లె సంపత్, పోరండ్ల రమేశ్, కొయ్యడ ర మేశ్గౌడ్, జవహర్‌రెడ్డి, ఇమ్మనేని అమర్రా వు, గుండు ప్రేమ్‌కుమార్, బూర తిరుపతి, వెల్ముల శ్రీనివాస్, జక్కుల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.