Chain snatching | వీణవంక, సెప్టెంబర్ 6 : కుటుంబాన్ని పోషించే స్థోమత లేక, మొదటి నుండి జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి అరవై ఏండ్లు దాటిన వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. దొగతనానికి ముందు రెండుమూడు సార్లు రెక్కీ నిర్వహించి వృద్ధ మహిళల మెడలోని బంగారం ఎత్తుకెళ్లడం.. వాటిని ముత్తూట్ ఫైనాన్స్, ఫిన్కార్స్లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఆరు నెలల వ్యవధిలో ఐదు చోట్ల దొంగతనాలకు పాల్పడి 14 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు.
48 గంటలు నిర్విరామంగా శ్రమించి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితున్ని చల్లూరు శివారులో పట్టుకొని 11 తులాల బంగారాన్ని రికవరీ చేయడంతో కథసుఖాంతమైంది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి కథనం ప్రకారం.. మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన కొలిపాక రవి (38) కుటుంబపోషణ భారమై, పేకాట ఆడుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం 60 ఏండ్లు దాటిన వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలోని బంగారు తాడ్లను దొంగలిస్తూ దొంగతనాలకు పాల్పడ్డాడు.
ఈ సంవత్సరం మార్చి నెల నుండి వరుసగా మండలంలోని చల్లూరు, మామిడాలపల్లి, దేశాయిపల్లి, మానకొండూరు మండలం అన్నారం, జమ్మికుంట మండలం కొత్తపల్లిలో ఐదు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడి ఏకంగా 14 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. వీటిలో కొంత బంగారాన్ని సుల్తానాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్, ఫిన్కార్స్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోగా, కొంత బంగారాన్ని మహారాష్ట్రకు తీసుకెళ్ి కరిగించుకొని డబ్బులు తెచ్చుకున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి, సిబ్బంది 48 గంటలు నిర్విరామంగా శ్రమించి నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శనివారం మండలంలోని చల్లూరు శివారులో పట్టుకున్నారు.
నిందితుడి దగ్గర నుండి 11 తులాల బంగారం రికవరీ చేసుకున్నట్లు, మరో చైన్ సుల్తానాబాద్ లోని ముత్తూట్ ఫినా కార్స్లో ఉన్నట్లు ఏసీపీ మాధవి తెలిపారు. చైన్‌స్నాచింగ్ కేసు చేధనకు కృషి చేసిన సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతిలను అభినందించి, హెడ్‌కానిస్టేబుల్ మోహన్, కానిస్టేబుళ్ళు కోమల్, ప్రశాంత్, రమేష్, మహేశ్ కు రివార్డులు అందజేసి, అభినందించారు.