తిమ్మాపూర్,జూన్27: పొలాలకు వెళ్లేందుకు ఉన్న దారిలో మురుగు నీళ్లు వచ్చి చేరుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో పొలాలకు వెళ్ళే దారిపైకి మోరీల నుంచి వచ్చే మురుగునీరు పారుతూ అస్తవ్యస్తంగా తయారైంది. గత కొన్ని ఏళ్లుగా సమస్య ఇలాగే ఉంటుండటంతో అటుగా వెళ్లే రైతులు, ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే భక్తులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రహదారిని పరిశీలించారు. సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కార్యదర్శి శ్రీకాంత్ హామీ ఇచ్చారు.
అటుగా వెళ్లే రైతులతోపాటు ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, పొలాలకు కూలీలు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని రైతులు వాపోయారు. ఒక వీధి మురుగునీరు అంతా దారిపైకి పారుతున్నదని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తాత్కాలిక మరమత్తులు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాచర్ల అంజయ్య, సుగుర్తి, జగదీశ్వర చారి, మాచర్ల అనిల్, గుజ్జుల రామ్ రెడ్డి, భూపతి రెడ్డి, లక్ష్మారెడ్డి, పొలం మల్లయ్య, గంగు వెంకటేష్, మాచర్ల స్వామి, సిద్ధ వెంకటి, కొమురయ్య, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.