మంథని, జూన్ 26: గత కొద్ది రోజులుగా మంథని ప్రాంతంలో దొంగలు రెచ్చి పోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దానికి కన్నం వేస్తూ ఉన్నదంతా ఊడ్చుకు పోతున్నారు. ఇలా మంథని ప్రాంతంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మంథని పట్టణంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో అడ్డు ఆదుపు లేకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతూ మమ్మల్ని పట్టుకునే వారే లేరంటూ సవాళ్లు విసురుతున్నట్లుగా ఒక దాని వెనుక ఒకటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే కేవలం నెల రోజుల వ్యవధిలో నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడటమే.
ఈ నెల 9న నడివీధిలోని గట్టు నందు-పద్మ ఇంట్లో చోరీ కోసం ప్రయత్నించినట్లు స్థానికులు గుర్తించారు. ఇంటి యజమాని నందు-పద్మ రెండు నెలల క్రితం నెదర్లాండ్‌లోని వారి పెద్ద కుమారుడి వద్దకు వెళ్లారు. దీంతో ఇంటికి తాళం ఉండటాన్ని గమనించి దొంగలు తాళం పగల గొట్టారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న బీరువాను పగలగొట్టేందుకు దొంగలు ప్రయత్నించి విఫలమయ్యారు.
జూన్ 18న మంథని మండలం ధర్మారం గ్రామంలో కందుకూరి లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారం తాడును ఎత్తుకెళ్ళాడు. తాజాగా ఈ నెల 23న రాత్రి దొంతులవాడలోని కొల్లారపు సందిలో తాళం వేసి ఉన్న ఇల్లెందుల వెంకటేశ్వర్లు ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇల్లెందుల వెంకటేశ్వర్లు పని నిమిత్తం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కి వెళ్లగా ఇంటి తలుపులను పగుల గొట్టి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న రూ.25 వేల నగదు, కిలో వరకు బరువు ఉన్న వెండితో చేసిన వివిధ దేవతా విగ్రహాలు, పాటు ల్యాప్‌టాప్, ట్యాబ్, టీవీతో పాటు మరికొన్ని విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. నెల రోజుల క్రితం స్థానిక రావుల చెరువుకట్ట హనుమానె దేవాలయ సమితికి సంబంధించిన స్టోర్ రూంలో ఉన్న భారీ ఇత్తడి గంజులను సైతం దొంగలు చోరీ చేశారు. అదేవిధంగా 6 నెలల క్రితం స్థానిక పద్మశాలి వీధికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ జూవెల్లరి షాపుల్లో బంగారం చోరీ చేశారు. షాపులో ఉన్న సీసీ కెమెరా చోరీ అంతా రికార్డు అయినప్పటికీ ఇంత వరకు పోలీసులు దొంగలను గుర్తించలేదు.
స్థానిక మందాటలో నొజ్జల గణేష్ శర్మ ఇంట్లో సైతం దొంగలు పడి సొత్తును దొంగలించుకెళ్లారు. పట్టణంలోని సుభాష్‌నగర్‌లో నివాసమున్న ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కుటుంబ ఊరికి వెళ్లడంతో తాళం పొగులగొట్టి ఇంట్లోకి వెళ్ళిన దొంగలు భారీగా బంగారు వస్తువులను ఎత్తుకెళ్ళారు. అదే ఏరియాలో నివాసమున్న వ్యవసాయ శాఖ ఏవోగా పని చేసిన అనూష ఇంట్లో సైతం దొంగులు పడి బంగారం, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పెంజేరుకట్టలో ఓ ఇంట్లో సైతం దొంగలు పడి బంగారం, డబ్బులు చోరీ చేశారు. ఇలా గత ఏడాదిన్నర కాలంగా దొంగలు చోరీలకు పాల్పడుతూనే వస్తున్నారు.
దొంగలు దర్జాగా తాళం వేసి ఉన్న ఇంటిని ఖాళీ చేస్తుండగా పోలీసులు దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో ఫిర్యాదులు తీసుకోవడం క్లూస్ టీంతో ఆధారాలు సేకరించే తంతు శరామామూలుగా మారిందే తప్పా ఒక్క దొంగను కూడ పట్టుకున్న పాపాన పోలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డులు లభ్యమైన, క్లూస్ టీంల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నప్పటికీ పోలీసులు దొంగలు పట్టుకోక పోవడం ఆంతర్యం ఏమిటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దొంగలు సైతం మమ్మిల్ని ఎవరు పట్టుకునే వారు లేరు అనే విధంగా విచ్చల విడిగా దొంగతనాలకు పాల్పడుతూ సవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి దొంగతనాలకు పాల్పడిన పట్టుకోవడంతో పాటు దొంగతనాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.