Godavarikhani | కోల్ సిటీ , మే 9 : గోదావరిఖని తిలక్ నగర్ చౌరస్తాలోని జంక్షన్ కు వేసిన ముసుగు ఇప్పటికీ తొలగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సమయంలో రామగుండం నగర పాలక అధికారులు నిబంధనలకు లోబడి వీటికి ముసుగులు తొడిగారు. అయితే ఎన్నికలు పూర్తై కోడ్ ఎత్తివేసినా వీటిని తీయడం మాత్రం అధికారులు మరిచారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల ఈ జంక్షన్లను నిర్మించిన విషయం విధితమే.
అయితే ‘కోరుకంటి’ మార్క్ కనిపించకుండా ఉండటం కోసమే ఆ ముసుగులను తొలగించకుండా వదిలేశారా..? అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ముసుగులు తొడిగినంత మాత్రాన కోరుకంటి మార్క్ ను చెరిపివేయగలరా అంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా నగర పాలక అధికారులు తేరుకొని ముసుగులను తొలగించి ఆ జంక్షన్లను అధికారికంగా ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.