KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 11 : భూగర్భ జలాలు పెంపొందించేందుకు గతంలో అధికారులు చేసిన లక్షల వ్యయం వృథాగా మారుతోంది. భారీ సంఖ్యలో ఇంకుడు గుంతలు నిర్మించిన ఆధికారులు. క్రమేణా వాటి నిర్వహణను గాలికొదిలేశారు. పర్యావసానంగా గుంతల్లో నీరు ఇంకడం దేవుడెరుగు.. నిధులు మాత్రం భూగర్భంలోకి వెళ్లాయి. ప్రస్తుతం వాటిలో తుప్పలు పెరిగి, మట్టిలో కూరుకపోయి శిథిలావస్థకు చేరి ఆధ్వానంగా మారాయి.
కొత్తవాటి ఊసేలేదు
మున్సిపాలిటీ స్థలాలు, ఇళ్లల్లో కొత్తగా ఇంకుడు గుంతల ఏర్పాటు ఊసే కనపడటం లేదు. కాంక్రీట్ నిర్మాణాలు పెరిగి పోవడంతో వర్షపు నీరంతా డ్రైనేజీ పాలవుతోంది. దీంతో భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి లేక భూగర్భ జలమట్టం పాతాళంలోకి పడిపోతోంది. నూతనంగా నిర్మించే గృహాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరించి వాటిని ఏర్పాటు చేయించడంలోనూ అధికారులు విఫలం అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పొదుపు చర్యలపై ప్రచారమేది?
వర్షపు నీటి నిల్వ పొదుపు చర్యలపై సంబంధిత శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అయితే గత ఏడాది నుంచి కొన్ని ఆయా శాఖలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తవ్విన ఇంకుడు గుంతల నిర్వహనను యంత్రాంగం మరిచిపోయింది. ఒకప్పుడు మున్సిపల్ ఖాళీ స్థలాలు, పార్కుల్లో కూడా ఇంకుడు గుంతలు నిర్మించింది. ఆపార్టుమెంట్ వాసులు, కాలనీ సంఘాలకు అవగాహన కల్పించి ప్రోత్సహించింది. గతంలో ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబందించి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించే వారు. కాలనీల్లో రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే 70 శాతం.. సొంత ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే 50 శాతం మేరకు నిధులు మంజూరు చేసేది. అయితే గతేడాది నుంచి ఈ పధకాన్ని పూర్తిగా అటకెక్కించగా, వీటిపై ప్రచారం కూడా కొరవడటంతో ప్రజలు ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి పొదుపుపై శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.