Putta Madhukar | పెద్దపల్లి, జూన్ 2(నమస్తే తెలంగాణ): నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాడు ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు మన కళ్ల ముందు నుంచే నీళ్లు దోచుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని అయినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కళ్లుండికూడా చూడకుండా ఉంటున్నాడని పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరణ చేసి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనాడు ఆంద్రా సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతంలోని నీళ్లను తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడకుండా మన హక్కులను కాలరాస్తూ మన అవసరాలను పక్క రాష్ట్రానికి ఇవ్వడం దుర్మార్గమని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ఆవిర్బావం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందనే విషయం యావత్తు ప్రపంచానికి తెలుసునని అన్నారు. ఆనాడు పదేళ్ల కాలంలో సీఎంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదర్శంగా నిలిపారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణాలోని తెలంగాణ నాయకులపై ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పాటు హక్కులు పరిరక్షించాలని, ఆకలి తీర్చాలని ఉద్యమాలు చేయడం బాధాకరమన్నారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదని దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా మిషన్ భగీరథ పథకం ఫెయిల్ అయిందని అంటున్నారని కానీ తాను ఇటీవల చత్తీస్ ఘడ్ సరిహద్దులోని బూర్గుగూడెం వెళ్లితే అక్కడ మిషన్ భగీరథ నీళ్లు తప్ప వేరే నీళ్లు లేవని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నాయకులు కళ్లున్న చూడలేని కబోదులని అందుకే అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను ఎండగట్టాలని, గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ నీతిని చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీశ్రేణులపై ఉందని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గంట రాములు, బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మండల అధ్యక్షుడు మార్క్ లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్‌లాల్, ఏగోళపు శంకర్‌గౌడ్, ప్రకాష్‌రెడ్డి, మాచీడి రాజుగౌడ్, మేదరవేన కుమార్, శంకేశి రవీందర్, గొబ్బూరి వంశీ, పూదరి సత్యనారాయణగౌడ్లతో పాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోసపోయామని ప్రజలు గ్రహించిండ్లు.. : దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ మోసపూరిత మాటలతో మోసపోయామని తెలంగాణ ప్రజలు గ్రహించిండ్లని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 14ఏండ్ల కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో.. అంటూ చేసిన ఆమరణ దీక్షతోనే తెలంగాణ వచ్చిందన్నారు.
రాష్ట్ర సాధకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు పాలన చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, అన్ని రంగాల్లో అభివృద్ది చేసి రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దారని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే ఆలోచనకు వచ్చారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, కేసీఆర్ పాలనలో ఎలాంటి అభివృధ్ది జరిగిందో సంక్షేమ పథకాల అమలును వివరించాలని, అలాగే కాంగ్రెస్ పాలనతో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వివరించాలని ఆయన పిలుపుపిచ్చారు.