Urea | పెగడపల్లి: జగిత్యాల జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండలం నంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను ఆయన శుక్రవారం సందర్శించి గోదాములలోని ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీవో మాట్లాడుతూ.. యూరియా కొరత నెలకొందనే తప్పుడు ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఇది తప్పు అని రైతుల అవసరాల మేరకు యూరియాను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు.
జిల్లాలో పంటల సాగుకు అనుగుణంగా ప్రభుత్వం ఎరువుల కోటాను కేటాయించిందని, దాని ప్రకారం అన్ని మండలాలకు ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు పంట పొలాల్లో యూరియాను మోతాదుకు మించి వాడొద్దని, అవసరం లేకున్నా వాటిని నిల్వచేయద్దని డీసీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సహకార సంఘాల సీఈవోలు రౌతు మధుకర్, తడకమట్ల గోపాల్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.